బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా కబ్జాలు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Muthe.Rajitha |

కేటీఆర్ హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ఆయన వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్​ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి ఆరోపించారు.

బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా కబ్జాలు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ఆయన వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్​ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారని, కబ్జాలకు ప్రభుత్వ భూములు గురి అయ్యాయని ఆయన విమర్శించారు.

ఆదివారం మీడియాతో చామల కిరణ్ కుమార్​రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, లండన్ చేస్తామని కేటిఆర్ ప్రజలను మభ్యపెట్టారని, నగరంలో ఉన్న నాళాల్లో మట్టిని సైతం బీఆర్ఎస్ హయాంలో తీయలేదని చామల కిరణ్​కుమార్​రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ, హైదరాబాద్ లో 75 శాతం చెరువులు, నాళాలు కబ్జా అయినట్లుగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు.

హైదరాబాద్ నగరంలో 600 చెరువులు ఉంటే బిఆర్ఎస్ హయాంలో 44 చెరువులు మొత్తం మాయం అయ్యాయని, 127 చెరువులు సగానికి సగం కబ్జాకు గురి అయ్యాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేటిఆర్ పదేళ్లు మున్సిపల్ శాఖామంత్రిగా ఉండి చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంతోనే అమాయకులు హైడ్రా బారిన పడ్డారని, శేరిలింగంపల్లి, హఫీజ్ పేట్ లో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి వసంత కృష్ణ ప్రసాద్ బిల్డింగులు కడితే 29 ఎకరాల్లో హైడ్రా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిని కాపాడిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

హైడ్రా వచ్చిన తర్వాత 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని, 360 చెరువుల్లో కబ్జాలను హైడ్రా తొలగించిందన్నారు. 20 నాళాల మీద ఆక్రమణలు,38 పార్కుల కబ్జాలను హైడ్రా తొలగించిందని, దేవరయాంజాల్ లో ప్రభుత్వ భూమిని, అప్రోచ్ రోడ్లను హైడ్రా కాపాడిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలో సంధ్య శ్రీధర్ రావు అనే వ్యక్తి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా162 ఫ్లాట్ ఓనర్ల భూములను బెదిరించి కబ్జా చేస్తే హైడ్రా కాపాడిందని, హైడ్రా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వచ్చింది కాదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం బయటపెట్టేందుకు హైడ్రా ఏర్పడిందని, హైదరాబాద్ నగరం వరద ముంపుకు గురి కాకుండా ఉండటం కోసం హైడ్రా కృషి చేస్తోందన్నారు.

Next Story