కేంద్రం నుంచి రూ.13 లక్షల కోట్లు తెచ్చి ఏం చేశారో చెప్పాలి.. కిషన్​ రెడ్డికి ఎంపీ చామల డిమాండ్

by Ramesh Naini |

రూ.13 లక్షల కోట్లు వస్తే రూ.8 లక్షల కోట్లు అప్పు ఎందుకు అవుతుందని ఎంపీ చామల నిలదీశారు.

కేంద్రం నుంచి రూ.13 లక్షల కోట్లు తెచ్చి ఏం చేశారో చెప్పాలి.. కిషన్​ రెడ్డికి ఎంపీ చామల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని దేశ,విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్‌కు వస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్​ ​రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగ,ఉపాధి కల్పనలు కల్పించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కుదేలు అయిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గాడిన పెట్టారని, గతంలో బీఆర్ఎస్ పాలనలో తప్పులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు కేంద్రం నుంచి తెచ్చామని అంటున్నారని రూ.13 లక్షల కోట్లు వస్తే రూ.8 లక్షల కోట్లు అప్పు ఎందుకు అవుతుందని నిలదీశారు. ప్రతి నెల రూ.8 వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తున్నామని, కుటుంబ పాలనలో తెలంగాణను దోచుకుంటుంటే కిషన్ రెడ్డి ఎందుకు రాష్ట్రాన్ని కాపాడలేదన్నారు. రాష్ట్రం అప్పుల దిశగా వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో రాష్ట్రాన్ని ఎందుకు రక్షించే ప్రయత్నం చేయలేదన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారని దొంగ లెక్కలతో రూ.13 లక్షల కోట్లు తెచ్చామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.13 లక్షల కోట్లు ఏ శాఖకు తెచ్చారో లెక్కలు చెప్పాలని చౌరస్తాలో మైక్ తీసుకుని దొంగ లెక్కలు చెప్పడం కాదు ఎప్పుడు తెచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. గత రెండు ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ,కేంద్ర మంత్రులను కలిసి మెట్రో రెండో దశ,మూసీ పునరుజ్జీవం,ట్రిపుల్ ఆర్,కొత్త ఎయిర్ పోర్టుల కోసం కలిశారని పేర్కొన్నారు.

తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ ప్రాజెక్టు రాత్రికి రాత్రి ఏపీకి తరలించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి జవాబు చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నారా, ఏ రాష్ట్రంలో అయినా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండు లక్షల రుణమాఫీ అయ్యిందో చెప్పాలన్నారు. తాము తెలంగాణ ప్రఖ్యాతిని పెంచుతుంటే బీజేపీ శాపనార్థాలు పెడుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని ప్రయత్నం చేస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందిరా పార్క్ లో ధర్నా రాజకీయ ఉనికి కోసం చేస్తున్నట్లు ఉందని, మంచి జరుగుతుంటే బీజేపీ నేతలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లు ఇస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ ఎందుకు పోతుందని మంచి చేస్తున్నారని భావిస్తే బీజేపీని మూడవ స్థానంలో ప్రజలు ఎందుకు కూర్చోబెడతారని పేర్కొన్నారు. తెలంగాణకు నిధులు ఇస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని, గ్లోబల్ సమ్మిట్ కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ హాజరై ప్రతినిధులకు భరోసా కల్పించాలన్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో కేంద్ర మంత్రులు ఇద్దరు విలన్లు కావద్దన్నారు.

విమాన ప్రయాణికుల ఇబ్బందులకు కారణం ఇండిగో :

దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడటానికి ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యం ప్రధాన కారణమని, గత సంవత్సరం డీజీసీఏ కొత్త రూల్స్ తెచ్చిందన్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ కొత్త రూల్స్ అమలు కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. నిబంధనలు అమలు అయితే పైలెట్లను ఎక్కువ మందిని తీసుకోవాల్సి వస్తుందని ఇండిగో సంస్థ భావించింది. ఏవియేషన్ ఇండ్రస్టీలో ఇండిగో ఎయిర్ లైన్స్ కు 60 శాతానికి పైగా వాటా ఉంది. డీజీసీఏ కొత్త రూల్స్ పై ఇండిగో ఎయిర్ లైన్స్ కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేసింది.కొత్త నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పుడు ఇండిగో ఎయిర్ లైన్స్ దగ్గర సరిపడా స్టాఫ్ ఉందా, ఎయిర్ క్రాఫ్ట్ ఎన్ని ఉన్నాయి,ఎంత మంది ప్రయాణికులు బుక్ చేసుకున్నారు అనే ఆలోచన విమానయాన శాఖ చేయాల్సి ఉండేదన్నారు. దేశంలో 60 శాతానికి పైగా వాటా ఉంది కాబట్టి మాపైన ఆంక్షలు ఎట్లా పెడతారని ఇండిగో ఎయిర్ లైన్స్ భావించింది. ఫ్లైట్స్ ఎగరకపోతే దేశ వ్యాప్తంగా ప్రజలకు నష్టం జరుగుతుంది.కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఇండిగో యాజమాన్యం పట్టుదలకు పోయిందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొత్త రూల్స్ కు మినహాయింపు ఇచ్చిందన్నారు. అత్యవసర ప్రయాణాల్లో రూ.10 వేలు ఉన్న టికెట్ రూ. 60 వేల నుంచి 70 వేల వరకు వెళ్ళింది అంటే కారణం కేంద్ర ప్రభుత్వమని, రీ ఫండ్ చేసి చేతులు దులుపు కుందామని ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ భావిస్తోంది. రీ ఫండ్ తీసుకున్న వారు ప్రయాణం చేయడానికి విమాన ప్రయాణం ధరలు అందుబాటులో లేవు. కొన్ని రోజులు ప్రయాణికులు విమానాల్లో ప్రయాణం చేయలేని పరిస్థితి వచ్చింది. ప్రయాణికుల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం,ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ పూర్తి నిర్లక్ష్యం వహించాయని మండిపడ్డారు.

Next Story