ధరణితో డేంజర్​బెల్స్.. ఎట్టకేలకు సర్కారులో కదలిక!!

by Disha Web Desk 2 |
ధరణితో డేంజర్​బెల్స్.. ఎట్టకేలకు సర్కారులో కదలిక!!
X

సీఎం కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకున్న ధరణి.. సర్కారుకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఉన్న సమస్యలు తీరుతాయని అనుకుంటే లేని చిక్కులు తెచ్చిపెడుతున్నదని రాష్ట్రవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. ధరణి పోర్టల్​కు ముందు వందల్లో వచ్చే భూ సమస్యలపై ఫిర్యాదులు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. ఫలితంగా ధరణి సమస్యలు అంతులేని కథగా మారాయి. ఈ సమస్యలు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రగతిభవన్​ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఎన్నికల సమయంలోగా ఈ సమస్యకు పరిష్కారం చూడాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. ఇందులోభాగంగా రెవెన్యూ శాఖకు సమర్థుడైన సీనియర్​ ఐఏఎస్​ అధికారిని నియమించి.. ధరణిని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చి పడింది. రెవెన్యూ శాఖకు కొత్త సెక్రటరీ కోసం రోజులకొద్ది చర్చోపచర్చలు చేస్తున్నది. ఏ ఐఏఎస్ ఆఫీసర్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలో ఆలోచిస్తున్నది. ఎందుకంటే ధరణి పోర్టల్ సమస్య అంతులేని కథగా మారింది. ఒకవైపు ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు నుంచి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ధరణితో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టు ప్రగతిభవన్ వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. అందుకే ధరణిని పూర్తిగా గాడిలో పెట్టేందుకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని అపాయింట్ చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం.

నాలుగేళ్లుగా పూర్తిస్థాయి సెక్రెటరీ కరవు

రెవెన్యూ శాఖకు నాలుగేళ్లుగా పూర్తి స్థాయి సెక్రటరీ లేరు. రెవెన్యూ సెక్రటరీగా ఉన్న రాజేశ్వర్ తివారీ 2019 అగస్టులో రిటైర్​ అయ్యారు. ఆ సమయంలో ఎక్సైజ్ శాఖ సెక్రెటరీగా ఉన్న సీఎస్ సోమేశ్ కుమార్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి ఆ శాఖ ఆయనవద్దే ఉంది. సీఎస్​గా నియమించిన తర్వాత కూడా రెవెన్యూ శాఖకు పూర్తి స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించలేదు. ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ సమయంలోనే రెవెన్యూ శాఖకు పూర్తి స్థాయి అధికారిని నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వ్యతిరేకత తగ్గించే ప్రయత్నాలు

ప్రభుత్వం అట్టహాసంగా అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్​పై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికీ కలెక్టర్లకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. పోర్టల్ కారణంగా గ్రామాల్లో కొత్త వివాదాలు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ భూమి పోర్టల్ లో నమోదైన కేసులు లక్షల్లో ఉన్నాయి. సొంత భూమిని ప్రభుత్వ భూమికి నమోదు చేశారనే కేసులు రోజురోజుకు వస్తున్నాయి. మ్యూటేషన్ జరగని భూములు అమ్మిన రైతుల వద్దే ఉండటంతో కాస్తులో ఉన్న రైతులకు పెద్ద సమస్యగా మారింది. మ్యుటేషన్ కోసం లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ధరణి సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ సమస్యకు ఫుల్​స్టాప్ పడాలంటే సమర్థుడైన అధికారిని పూర్తిస్థాయిలో నియమించాలని సీఎం కేసీఆర్ భావిస్తునట్టు సమాచారం.

ధరణిపై మంత్రుల పెదవి విరుపు

ఓ కేబినెట్ మీటింగ్‌లోనే ఐదారుగురు మంత్రులు ధరణి పోర్టల్ వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకునే ధరణి సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అనే చర్చ కూడా పార్టీలో జరిగింది. కేబినెట్ లో మంత్రులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీని సైతం కేసీఆర్ నియమించారు. ఈ కమిటీ పలు సార్లు సమావేశమై ధరణిలోని సమస్యలపై ఆధ్యయనం చేసింది. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటించి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆదిలో హడావుడి చేసిన మంత్రుల కమిటీ ఆ తర్వాత చేతులెత్తేయడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొన్నది.


Next Story

Most Viewed