కిషన్ రెడ్డి సమక్షంలో కీలక ఒప్పందం.. తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం

by Gantepaka Srikanth |

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి సమక్షంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది.

కిషన్ రెడ్డి సమక్షంలో కీలక ఒప్పందం.. తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి సమక్షంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, ఎస్​ఎస్​సీటీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించనున్నారు. అధ్యాపకులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించి సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రయోగశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు Internships, workshops, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు. అదనంగా ఎస్​ఎస్​సీటీయూ అధ్యాపకులకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ అందించనుంది.

బోధనలో మెళుకువలు పెంపొందించేందుకు కార్యశాలలు, సెమినార్లు, అతిథి ఉపన్యాసాలను నిర్వహిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి సాంకేతిక కోర్సుల నిర్వహణకు ఐఐటీ హైదరాబాద్ సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బీటెక్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లో బీఎస్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్లో బీఎస్ వంటి కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ కోర్సులను బోధించే అధ్యాపకులకు శిక్షణ బాధ్యతను ఐఐటీ హైదరాబాద్ చేపడుతుంది. ఐఐటీ హైదరాబాద్ మార్గదర్శకత్వంలో నిర్వహించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కార్యక్రమాల ద్వారా తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందుతూ, ప్రాంతీయ విద్యా అభివృద్ధికి దోహదం చేయనుంది.

Next Story