- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైన్లకు వెరువని వాహనదారులు.. ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం!
హైదరాబాద్‌లో ఫైన్లకు వెరవని వాహనదారులు.. ఏటా 70 లక్షల చలాన్లు, హెల్మెట్ లేకపోవడంతోనే 80 శాతం రోడ్డు ప్రమాద మరణాలు!

దిశ, తెలంగాణ బ్యూరో: తలకు హెల్మెట్ ఉండదు.. మెడను ఒక వైపు వంచి భుజం సాయంతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే డ్రైవింగ్.. దీనికి తోడు ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా నగర వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నా, ఏఐ కెమెరాలు నిరంతరం నిఘా పెడుతున్నా ఉల్లంఘనల పర్వం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో చలాన్లు రికార్డవుతున్నా.. ఒకే వాహనంపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్‌లో ఉంటున్నా ఏమాత్రం పట్టించుకోకుండా దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు.
ఏటా 70 లక్షల చలాన్లు
నగరంలో ఏటా సగటున 70 లక్షల చలాన్లు నమోదవుతుండగా, ఇందులో అత్యధికం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఉల్లంఘనల్లో ఓవర్ స్పీడ్‌దే మొదటి స్థానం కావడం గమనార్హం. ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లతో పాటు జనం రద్దీగా ఉండే ఏరియాల్లోనూ కొందరు అతి వేగంతో దూసుకు వస్తుండటంతో నమోదవుతున్న మొత్తం చలాన్లలో 40 శాతం ఈ చలాన్లు వీటికే పడుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 30 శాతం చలాన్లు హెల్మెట్ ధరించకపోవడం వల్లే నమోదవుతున్నాయి. ఫోర్ వీలర్స్ డ్రైవర్లు సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలు భారీ సంఖ్యలోనే రికార్డు అవుతున్నాయి.
ఫేక్ నంబర్ ప్లేట్లు
చలాన్ల బారి నుంచి తప్పించుకునేందుకు కొందరు ఫేక్ నంబర్ ప్లేట్‌లను తగిలించుకుంటున్నారు. ఇటీవల ఓ లగ్జరీ కారు యజమాని ఏకంగా డ్రైవింగ్ సీట్‌లో కూర్చునే హైడ్రాలిక్ సిస్టమ్ పద్ధతిలో ఒరిజినల్ నంబర్ ప్లేట్ స్థానంలో సెకన్ల వ్యవధిలోనే ఫేక్ నంబర్ ప్లేట్ అమరేలా లేటెస్ట్ టెక్నాలజీని వాడటం చూసి ట్రాఫిక్ పోలీసులే విస్తుపోయారు. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రతి వాహన యజమాని తమ మొబైల్ నంబర్, ఈ మెయిల్‌ను పరివాహన్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు తెచ్చింది. ఇకపై పోస్టు ద్వారా కాకుండా డిజిటల్ పద్ధతిలోనే చలాన్లు పంపాలని నిర్ణయించింది.
డిస్కౌంట్ కోసం..
ఇంత జరుగుతున్నా వాహనదారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడానికి తరచూ ప్రకటిస్తున్న డిస్కౌంట్ల స్కీమ్ లే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎప్పుడో ఒకసారి డిస్కౌంట్ ఇస్తారు కదా.. అప్పుడు క్లియర్ చేసుకోవచ్చన్న భావన వాహనదారుల్లో బలంగా నాటుకుపోయింది. దీనివల్లే జరిమానా చెల్లించకపోయినా ఇబ్బంది లేదన్న నిర్లక్ష్యపు ధోరణి పెరిగిపోయింది.
80 శాతం మరణాలు
ఇటీవల హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో అతివేగంగా వెళ్తూ అదుపుతప్పిన ఓ స్పోర్ట్స్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారు హెల్మెట్ ధరించి ఉంటే కచ్చితంగా ప్రాణాలతో బయటపడేవారని పోలీసులు అంటున్నారు. కూకట్‌పల్లి సమీపంలో ఇటీవల జరిగిన మరో ప్రమాదంలో.. ఓ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన భారీ వాహనం ఢీకొట్టింది. ఆ యువకుడు కిందపడిన సమయంలో తల రోడ్డుకు బలంగా తాకింది. కానీ, అతను హెల్మెట్ ధరించి ఉండటంతో ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
ద్విచక్ర వాహన ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాల్లో 80 శాతానికి పైగా హెడ్ ఇంజ్యూరీ కావడం వల్లే జరుగుతాయి. ట్రాఫిక్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు కేవలం నాసిరకం ప్లాస్టిక్ క్యాప్ లాంటి హెల్మెట్లు, భవన నిర్మాణ కార్మికులు వాడే హెల్మెట్లు వాడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఇవి ఏమాత్రం రక్షణ కల్పించవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే.
పిల్లలు ఎదురుచూస్తుంటారు..
ఒకసారి ప్రమాదం జరిగి తలకు తీవ్ర గాయమైతే.. ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కుతాయన్న గ్యారంటీ ఉండదు. కేవలం వెయ్యి రూపాయలు పెట్టి నాణ్యమైన హెల్మెట్ కొనుగోలు చేస్తే ఆ ప్రాణాన్ని సులువుగా నిలబెట్టుకోవచ్చు. చలాన్ పడితే వందల్లో పోతుంది, కానీ ప్రమాదం జరిగితే తిరిగిరా ని లోకాలకు వెళ్లాల్సి వస్తుందన్న సత్యాన్ని వాహనదారులు గ్రహించాలి. ఇంటి దగ్గర మీ కోసం భార్య, పిల్లలు ఎదురుచూస్తుంటారు. హెల్మెట్ ధరించడాన్ని బాధ్యతగా మార్చుకోవాలి.: - రాహుల్ హెగ్డే బీకే, డీసీపీ, ట్రాఫిక్, హైదరాబాద్






