Motkupalli: ఆ పని చేస్తే రేవంత్ రెడ్డి మీదున్న గౌరవం ఇంకా పెరుగుతది

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) లేఖ రాశారు.

Motkupalli: ఆ పని చేస్తే రేవంత్ రెడ్డి మీదున్న గౌరవం ఇంకా పెరుగుతది
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) లేఖ రాశారు. రేవంత్ రెడ్డిని మాదిగల పెద్దన్నగా భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మాదిగలు తలపెట్టిన సమావేశానికి అనుమతి ఇస్తే సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. బీసీ(BC), ఎస్సీ(SC), ఎస్టీ(ST)ల బతుకులు మారాలంటే రాజ్యాధికారం అనివార్యమైందని తెలిపారు. ఇదిలా ఉండగా.. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో మంద కృష్ణమాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో జరిగే లక్ష డప్పులు.. వేల గొంతులు కార్యక్రమం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోత్కుపల్లి నర్సింహులు మద్దతిచ్చారు. మాదిగలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మంద కృష్ణమాదిగ(Manda Krishna Madiga)కు పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

SC వర్గీకరణ సాధన కోసం భారీగా చేపట్టిన లక్ష డప్పులు, వేల గొంతులు కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలవబోతుందని చెప్పారు. మాదిగలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా మాదిగ, ఇతర ఎస్సీ కులాలకు తీరని ద్రోహం, మోసం చేస్తున్న ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకోవడానికి ఈనెల 7న హైదరాబాద్‌లో లక్ష డప్పుల లాంగ్ మార్చ్ జరగబోతున్నదని అన్నారు. ఇది ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ జరగని అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమం అని అందుకు మాదిగలు, ఇతర ఎస్సీ కులాలు డప్పులు, వాయిద్యాలతో సిద్ధం కావాలని పిలుపునిచారు.

Next Story