Viral : మాతృత్వపు వేడుకలు : బేబీ బంప్‌ మెహందీ.. నయా ట్రెండ్ వైరల్

by Ramesh Naini |

తాజాగా సోషల్ మీడియాలో ‘బేబీ బంప్ మెహందీ’ అనే కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. గర్భంతో ఉన్న మహిళలు తమ పొట్టపై రకరకాల డిజైన్లతో మెహందీ పెట్టుకుంటూ ఫోటోలు పంచుకుంటున్నారు.

Viral : మాతృత్వపు వేడుకలు : బేబీ బంప్‌ మెహందీ.. నయా ట్రెండ్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఈ క్షణాలను కెమెరాల్లో బంధించుకునేందుకు ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌లు చేసుకోవడం ఈ మధ్య సర్వసాధారణమైంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ‘బేబీ బంప్ మెహందీ’ అనే కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. గర్భంతో ఉన్న మహిళలు తమ పొట్టపై రకరకాల డిజైన్లతో మెహందీ (గోరింటాకు) పెట్టుకుంటూ ఫోటోలు పంచుకుంటున్నారు. తాజాగా దీనిపై ఓ నెటిజన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

వైరల్ పోస్ట్‌లో ఏముందంటే!

ఓ నెటిజన్ ఈ సరికొత్త ట్రెండ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో @RajveerIND అనే ఎక్స్ యూజర్ ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘టాటూల తర్వాత ఇప్పుడు ‘బేబీ బంప్ మెహందీ’ కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. మహిళలు తమ బేబీ బంప్‌పై పెయింటింగ్ వేసుకుని దాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. వాళ్లకు విలువలు నేర్పాల్సిన కుటుంబ సభ్యులే ఇలాంటి షో-ఆఫ్‌ను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉంది. ఒకప్పుడు మహిళలు గర్భాన్ని ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టి రక్షించుకునే వారు. కానీ, ఇప్పుడు అది కేవలం ఫ్యాషన్, ఫోటోల కోసం ఒక సాధనంగా మారిపోయింది. పుట్టబోయే బిడ్డపై మెహందీలోని రసాయనాల వల్ల పడే ప్రభావం, ఆరోగ్య ప్రమాదాలను జనాలు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇది నిజంగా మాతృత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవడమా? లేక సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం చేస్తున్న మరో ప్రయత్నమా?’ అని నెటిజన్ పోస్టులో రాసుకొచ్చారు.

రెండు వర్గాలుగా చీలిపోయిన నెటిజన్లు..

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది నెటిజన్‌లు.. ‘ఇది కచ్చితంగా మాతృత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కేవలం అటెన్షన్ కోసం పడుతున్న ఆరాటం’ అని కామెంట్ చేశారు. ఇంకొందరు ఆ గర్భిణీకి మద్దతుగా నిలుస్తున్నారు. ‘చూడటానికి చాలా అందంగా ఉంది’ అని ఒకరు ప్రశంసించారు. మరొకరు కాస్త ఘాటుగా స్పందిస్తూ.. ‘ఆమె ప్రెగ్నెన్సీని ఆమెను ఎంజాయ్ చేయనివ్వండి! దీంట్లో మీ జోక్యం అనవసరం’ అని బదులిచ్చారు. ఇంకో నెటిజన్ కాస్త సరదాగా స్పందిస్తూ.. ‘నేను ఈ బేబీ బంప్ మెహందీని సపోర్ట్ చేస్తున్నాను. ఇది చాలా మంచి పరిణామం, దీనివల్ల పరోక్షంగా మన దేశంలో సంతానోత్పత్తి రేటు (TFR) కూడా పెరుగుతుంది’ అని కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ, మారుతున్న కాలంతో పాటు వస్తున్న ఇలాంటి కొత్త ట్రెండ్స్ నెట్టింట ఎప్పుడూ ఒక వివాదానికి లేదా చర్చకు కేంద్ర బిందువు అవుతున్నాయి.

Next Story