- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాతృభాషకు పట్టాభిషేకం.. ప్రతీ స్కూల్లో తెలుగు తప్పనిసరి
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లలో నూతన విద్యాసంవత్సరం నుంచి తెలుగును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం, తెలుగు భాషా సాహిత్యాలను రక్షించుకోవాలని సంకల్పించింది. ఇందులో భాగంగా, రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో 1 నుండి 10 వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయనుంది. కేవలం స్టేట్ బోర్డు పాఠశాలల్లోనే కాకుండా, రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుండి తెలుగును తప్పనిసరిగా బోధించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మినహా చాలా ప్రైవేటు, కార్పోరేటు పాఠశాలల్లో తెలుగు భాషను అమలు చేయడం లేదు. సీబీఎస్ఈ, ఐబీఎస్ఈ, తదితర సిలబస్ ను అమలు చేస్తున్న కార్పోరేట్ పాఠశాలలు లాంగ్వేజ్ ఎంపికలో ఎక్కువ మార్కులు వచ్చేలా అరబిక్, సంస్క్రుతం, విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థులు తెలుగు పట్టించుకోక, కనీసం తెలుగు పదాలు చదవలేని పరిస్థితిలో ఉంటున్నారు. పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు కొందరు కనీసం తెలుగులో పూర్తి వాక్యాలు సైతం చదవలేని పరిస్థితిలో ఉన్నారు.
దశల వారీగా అమలు
ప్రభుత్వం తెలుగు తప్పనిసరి అమలు చట్టం-2018 ప్రకారం, 2018-19 నుండి దశలవారీగా తెలుగును అమలు చేస్తూ వస్తోంది. 2018-19 సంవత్సరంలో 1, 6 వ తరగతులు, 2022-23 సంవత్సరం నుండి 1 నుండి 10వ తరగతుల వరకు అమలు లక్ష్యంగా పెట్టుకుంది అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా తరగతులు సరిగ్గా నిర్వహించలేకపోవడంతో 9, 10 తరగతులకు గతంలో కొంత మినహాయింపు ఇచ్చారు. తాజా పొడిగింపు ప్రకారం, 2025-26లో 9వ తరగతి విద్యార్థులకు, 2026-27లో 10వ తరగతి విద్యార్థులకు తెలుగు అమలు విషయంలో కాలపరిమితిని సడలించారు. కానీ, 2026-27 విద్యా సంవత్సరం నుండి మాత్రం అన్ని పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు తెలుగును కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.
సరళమైన తెలుగు
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి బోర్డు పాఠశాలల కోసం కఠినమైన సింగిడి పాఠ్యపుస్తకానికి బదులుగా, సులభంగా ఉండే వెన్నెల పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి 8వ తరగతి లేదా ఆపై తరగతుల్లో చేరే విద్యార్థులకు మాత్రమే తెలుగు నుండి మినహాయింపు ఉంటుంది. తెలుగును అమలు చేయని పాఠశాలలపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు విధించనున్నారు. అన్ని పాఠశాలలు తగినంత మంది తెలుగు ఉపాధ్యాయులను నియమించుకోవాలని, ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన పాఠ్యపుస్తకాలనే వాడాలని స్పష్టం చేసింది.






