- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాలపై మరింత ఫోకస్.. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం: మంత్రి కీలక నిర్ణయం
తెలంగాణ గ్రామీణాభివృద్ధిలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గ్రామీణాభివృద్ధిలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతను పెంచే లక్ష్యంతో జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిరంతర పర్యవేక్షణ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగం తదితర కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేసేలా కమిషనరేట్‌లోని సీనియర్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రతి రెండు జిల్లాలకు ఒక అధికారిని నియమించారు. ఈ ప్రత్యేక అధికారులు ప్రతివారం కనీసం ఒకరోజు తమకు కేటాయించిన జిల్లాలో తప్పనిసరిగా పర్యటించాలి. పర్యటనలో భాగంగా కనీసం రెండు గ్రామ పంచాయతీలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
సమీక్షించనున్న అంశాలు..
కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వ్యయం, సిబ్బంది (పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్ వర్కర్లు) జీతాల చెల్లింపులు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, వీధి కుక్కల నివారణ, స్వచ్ఛ భారత్ కింద వ్యర్థాల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ పనులు, నమూనా గ్రామాల అభివృద్ధి, సామాజిక తనిఖీలు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో పారదర్శకత వంటి అంశాలను ప్రత్యేక అధికారులు సమీక్షించనున్నారు. ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తికి చేరడమే కాకుండా, పనుల్లో నాణ్యతను పెంచడం, అధికారుల్లో జవాబుదారీతనం తీసుకురావడమే ఈ ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు తమ పర్యటనల అనంతరం సమర్పించే నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.






