- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుతుపవనాలు వచ్చాయి.. వర్షాలు మాత్రం రావట్లేదు! 17 జిల్లాల్లో లోటు వర్షపాతం
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా.. వరుణుడి కరుణ మాత్రం కరువైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా.. వరుణుడి కరుణ మాత్రం కరువైంది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో.. సాగు పనులు మొదలు పెట్టిన రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జూలైలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెప్పడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది.
సాధారణం కంటే తక్కువే
గతంలో కంటే ఈ ఏడాది ఆలస్యంగా రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. గత నెల 8 న నైరుతి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తెలంగాణను తాకింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 265 మండలాల్లో లోటు, 46 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. ఎల్ నినో పరిస్థితుల కారణంగా జూలై నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
17 జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితులు
రాష్ట్రంలో కేవలం 16 జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదైంది. కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాలో ఈ జాబితాలో ఉన్నాయి. మిగిలిన 17 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. నైరుతి కదలికలు మందగించడంతో జూలైలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కాగా, రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.






