- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కబ్జా కోరల్లో ఫిష్ ప్రొడక్షన్ కేంద్రాలు.. అధికారులు మౌనమేల?
రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైనా చేపల పిల్లల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైనా చేపల పిల్లల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువులు నిండే సమయం దగ్గరలో ఉందని ఇప్పటివరకు ఫిష్ సీడ్స్ పంపిణీపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఈఏడాది చేపలకు ఆధిక ధరలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత బీఆర్ఎస్ పాలనలో చేపల పెంపకానికి సంబంధించి వానాకాలం ప్రారంభం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో చేప విత్తనాల పెంపకానికి చర్యలు చేపట్టి ఆగస్టులో చెరువులు నిండగానే సహకార సంఘాలకు విత్తనాలు సరఫరా చేసే వారు. 26,357 చెరువుల్లో 85.60 కోట్ల చేప పిల్లలను విడుదల జరిగేది. ఈఏడాది ఇప్పటివరకు చేపల పెంపకంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఉపాధి కోసం వలస బాట పట్టాల్సి వస్తుందని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా చేప పిల్లల విత్తనాల సరఫరా ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడంతో వారు నాణ్యమైన పిల్లలు ఇవ్వడం లేదని అదే డబ్బులు సంఘాలకు ఇస్తే తామే మంచి రకాల చేప పిల్లలు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను మత్స్య రంగంలోకి అడుగు పెట్టనివ్వొద్దని సూచిస్తున్నారు.
కబ్జాకు ఫిష్ ప్రొడక్షన్ కేంద్రాలు
రాష్ట్రంలో ఫిష్ ప్రొడక్షన్ కేంద్రాలు ఉమ్మడి రాష్ట్రంలో 28 ఉండగా ప్రస్తుతం 21 మాత్రమే ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన స్థలాలు కబ్జాదారులు చేతుల్లోకి వెళ్లాయనే విమర్శలు ఉన్నాయి. కరీంనగర్లోని ఎల్ఎండీ వద్ద 14 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు వద్ద 41.14 ఎకరాలు, సంగారెడ్డి మంజీరా వద్ద 24.08 ఎకరాలు, మెదక్లో 15.35 ఎకరాలు, వరంగల్ జిల్లా భీమారంలో 30.36 ఎకరాలు ఉంది. నల్లగొండ జిల్లా తుమడంలో 74 ఎకరాలు, కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో 60 ఎకరాలు, రాజన్న సిరిసిల్లలో 25 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం కిన్నెరసాని వద్ద 13.18 ఎకరాలు భూమి ఉంది. ఎక్కవ భూమి కలిగిన ఫిష్ కేంద్రాలను స్థానికంగా ఉండే కొందరు నాయకులు కబ్జా చేసి పక్కనే ఉన్న మరో సర్వే నెంబర్ వేయించుకుని పట్టాలు చేసుకున్నట్లు అక్కడి మత్స్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. కబ్జాలపై రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిసింది.
ఫిష్ సీడ్స్ ఉత్పత్తి మత్స్యసంఘాలకే ఇవ్వాలి
షిప్ సీడ్స్ ఉత్పత్తి మత్స్యసంఘాలకే ఇవ్వాలని టెండర్లు వేసి ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వొద్దని మత్స్యకారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గతేడాది టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలు 70 నుంచి 80 శాతానికిపైగా ఫిష్ సీడ్ ఏపీలోని ఏలూరు, కైకలూరు, భీమవరం నుంచే సేకరించారు. చేప పిల్లల పంపిణీ పథకం 8 ఏళ్లుగా కొనసాగుతున్నా ఇప్పటికీ సొంతంగా ఉత్పత్తి చేసుకునే పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 85.60 కోట్ల చేప పిల్లల అవసరం ఉంటే ఇందులో మత్సశాఖ ఆధ్వర్యంలో నీటి వనరుల్లో పెంచుతున్న చేప పిల్లల సీడ్ కనీసం 10 శాతం కూడా ఉండడం లేదు. దీంతో 95 శాతానికిపైగా చేపపిల్లలను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని జలాశయాల్లో చేప పిల్లలను పెంచుకునే వెసులుబాటు ఉందని ఇక నుంచి సొంతంగా సీడ్ ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మత్స్యసంఘాలు కోరుతున్నాయి.






