తెలంగాణ ఎంపీలకు మోడీ క్లాస్.. లీక్ చేసిన ఆ ఏపీ ఎంపీ!

by Kema Shiva Kumar |

రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య అదే పార్టీకి చెందిన ఏపీ ఎంపీ చిచ్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది.

తెలంగాణ ఎంపీలకు మోడీ క్లాస్.. లీక్ చేసిన ఆ ఏపీ ఎంపీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య అదే పార్టీకి చెందిన ఏపీ ఎంపీ చిచ్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో తెలంగాణ ఎంపీల మధ్య ఉన్న విభేదాలు మరింత ముదిరినట్లు చర్చ జరుగుతున్నది. ఈ మధ్య ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎంపీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షపాత్ర పోషించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాలు అన్ని మీడియాల్లో రావడంతో రాష్ట్రంలోని కేంద్రమంత్రులు షాక్ అయ్యారు. ఇంటర్నల్ మీటింగ్‌లో చర్చించిన అంశాలను లీక్ చేసింది ఎవరు? అని ఆరా తీయగా ఏపీకి చెందిన ఓ ఎంపీ హస్తం ఉందని తేలడంతో ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు.

ఒకరిపై మరొకరికి అనుమానం..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ ఈనెల11న తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎంపీల పనితీరుపై ఆరా తీశారు. పార్టీ ఎందుకు వెనకబడిందని, ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా లీడర్ల మధ్య ఉన్న విభేదాలు వీడాలని సూచించారు. మీటింగ్ పూర్తయిన కొద్ది సేపటికి మోడీ క్లాస్ తీసుకున్న అంశాలు అన్ని మీడియాకు చేరాయి. దీనితో ఎంపీలు తమ పరవు పోయిందని ఆవేదన చెందినట్లు తెలిసింది. ఇంటర్నల్ మీటింగ్ విషయాలను లీకు చేసింది ఎవరు? దీని వెనుక ఉత్తర తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారా? దక్షణ తెలంగాణ చెందిన ఎంపీలు ఉన్నారా? గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉన్నారా? అనే కోణంలో ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

యాధృచ్ఛికమా.. అధిష్టానం ఆదేశమా?

మోడీతో జరిగిన మీటింగ్‌కు తెలంగాణ ఎంపీలతో పాటు ఏపీకి చెందిన పలువురు ఎంపీలు కూడా హాజరయ్యారు. తెలంగాణ ఎంపీలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాలను ఏపీకి చెందిన ఓ ఎంపీ లీకు ఇచ్చారని నాలుగైదు రోజుల తర్వాత తెలంగాణ ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. సదరు ఎంపీ అనుకోకుండా ఇంటర్నల్ మీటింగ్ విషయాలను బయటకు చెప్పారా? లేకపోతే తెలంగాణ లీడర్ల పనితీరులో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అధిష్టానమే లీకు ఇప్పించిందా? అని చర్చ జరుగుతున్నది. నిజానికి తెలంగాణ ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని కేడర్ కూడా అసహనంగా ఉంది. 8 మంది ఎంపీల్లో ఏ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, ఒకరంటే మరొకరికి గిట్టదని విమర్శలు ఉన్నాయి. మోడీ క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా ఎంపీల పనితీరులో మార్పు రాలేదని, ఈ పది రోజుల్లో ఒక దగ్గర కూర్చోని పార్టీ బలోపేతం కోసం ఏం చేయ్యాలో సమావేశం కాలేదని కేడర్ మండిపడుతున్నారు.

Next Story