జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మరోసారి కీలక ప్రకటన చేసింది.

జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం ప్ర‌క‌ట‌న‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మరోసారి కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో ఏ ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. అలాగే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సమగ్ర ప్రణాళికతో తిరిగి సమర్పించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు వెల్లడించింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రం అనుసరిస్తున్న ప్రమాణాల గురించి, పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల గురించి, అలాగే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించే అంశంపై కేంద్రం స్పందించింది.

సాగునీటి సామర్థ్యాన్ని బట్టి జాతీయ హోదా

కేంద్రం సమాధానం ప్రకారం.. ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడానికి నిర్దిష్ట మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని తెలిపింది. అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల అంశాలకు సంబంధించినవి, జాతీయ ప్రాధాన్యత కలిగినవి లేదా గణనీయమైన సాగునీటి సామర్థ్యాన్ని సృష్టించే ప్రాజెక్టులకే ఈ హోదా కల్పిస్తారని పేర్కొంది. అయితే.. ప్రస్తుతం అలాంటి హోదా కోసం ఏ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీపీఆర్ కేంద్ర జల సంఘానికి అందిందని కేంద్రం తెలిపింది. అయితేజజ ప్రాజెక్టు ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోజనాలు పూర్తిస్థాయిలో ఎలా సాధిస్తారో వివరిస్తూ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సూచిస్తూ డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు పేర్కొంది. అదేవిధంగా.. ప్రధాన, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల సాంకేతిక పరిశీలన కేంద్ర జల సంఘం రూపొందించిన 2017 మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరువు నివారణ, తాగునీటి భద్రత, సాగునీటి విస్తరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అర్హత కలిగిన ప్రాజెక్టులను ఆయా నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని పేర్కొంది.

Next Story