ఎంఎంటీఎస్ ఆధునీకరణ.. మెట్రో, ఆర్టీసీతో అనుసంధానం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-11 08:33:02  IST  )

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు వ్యవస్థను మెట్రో, ఆర్టీసీలతో అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆధునీకరణ పనులు చేపట్టనుంది.

ఎంఎంటీఎస్ ఆధునీకరణ.. మెట్రో, ఆర్టీసీతో అనుసంధానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజారవాణా మార్గాలపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోరైలు స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ రైలు వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు ఎంఎంటీఎస్, మెట్రోరైలు, ఆర్టీసీలను అనుసంధానంలో భాగంగానే కామన్ టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. 2050 వరకు క్యూర్ పరిధిలో 50 శాతం ప్రజారవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకనుగుణంగా ఎంఎంటీఎస్ స్టేషన్లను ఆధుణీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది.

ఎంఎంటీస్ స్టేషన్లకు ఆధునిక హంగులు

ఎంఎంటీఎస్ స్టేషన్లు అధ్వాన్నంగా ఉన్నాయి. వీటిని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి హెచ్ఎండీఏ చర్యలు తీసుకోనుంది. ప్రయాణికులకు వెయిటింగ్ ఫెసిలిటీ సెంటర్లను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టేషన్లలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ డెవలప్ చేయనున్నారు. బస్ స్టాప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రయివేటు షేరింగ్ వాహనాలను అనుసంధానం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బైకులు, కార్ల పార్కింగ్ కోసం మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నాంపల్లిలో మెట్రోరైలు స్టేషన్ వద్ద మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు.

2050 వరకు 50 శాతం ప్రజారవాణా

క్యూర్ పరిధిలో 2050 నాటికి 50 శాతం ప్రజారవాణా మార్గాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సమగ్ర ట్రాఫిక్, రవాణా అధ్యయనం (సీటీటీఎస్)- 2011 దీన్ని సవరించి 2017లో మరోసారి అధ్యయనం చేశారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టారు. 25కుపైగా ఫ్లైఓవర్లను పూర్తిచేశారు. హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో ఫ్లైఓవర్లు, అనుసంధాన రహదారులు, స్కైవాక్‌లను చేపట్టారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050లో కాంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ) నివేదిక సైతం రెడీ అయింది. ప్రజారవాణాలో చేపట్టాల్సిన అంశాలకు సంబంధించిన సిఫార్సులు చేసింది.

రహదారుల విస్తరణ

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో నార్త్ నుంచి సౌత్, వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు 51 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి చుట్టుపక్కల అనుసంధాన రహదారులను విస్తరించడం, అవసరమైన చోట యుటిలిటీ లైన్లను మార్చడం, ఉన్న రోడ్ మార్గాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. ప్రయాణికులు రద్దీ ఉన్న ఎంఎంటీఎస్ స్టేషన్లకు బస్‌స్టాప్‌లను మరింత దగ్గరగా మార్చడం, జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస–వాణిజ్య ప్రాంతాలకు అనుగుణంగా బస్సు మార్గాలను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ప్రైవేట్ ఫీడర్ సేవలు (షేర్‌డ్ వాన్లు/షటిల్‌లు) ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఎంఎంటీఎస్ స్టేషన్‌కు సమీపంలోని బస్‌స్టాప్‌లు, మార్గాలను మ్యాపింగ్ చేసి స్టేషన్ అనుసంధానం చేయనున్నారు. మెట్రో స్టేషన్ల సమీపంలోని బస్‌స్టాప్‌లను సక్రమంగా అనుసంధానించి, రహదారులపై పాదచారుల ప్రమాదకర కదలికలను నివారించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు.

హైదరాబాద్‌లో నేడు, రేపు పలు MMTS రైళ్లు రద్దు

Next Story