ఎమ్మెల్సీ విజయశాంతి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫీజుల వసూళ్లపై చూపే శ్రద్ధను, విద్యా సంస్థల నిర్వహణలో కనీస ప్రమాణాలు పాటించడంలో కూడా చూపాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ విజయశాంతి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫీజుల వసూళ్లపై చూపే శ్రద్ధను, విద్యా సంస్థల నిర్వహణలో కనీస ప్రమాణాలు పాటించడంలో కూడా చూపాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్ మెంట్ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలంటూ హైకోర్టు ఇటీవల జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సానుకూల నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలపడం హర్షణీయమని విజయశాంతి పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంలో తప్పులేదని, కానీ దానికి తగ్గట్టుగా కాలేజీల్లో సరైన వసతులు, నాణ్యమైన విద్యా ప్రమాణాలు కల్పించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుందని విజయశాంతి స్పష్టం చేశారు.

శాసన మండలిలోనూ మాట్లాడా..

ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించడం లేదని, కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని విజిలెన్స్ కమిషన్ విచారణలో తేలిందని ఆమె గుర్తుచేశారు. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించిందన్నారు. ఫీజులు ఇస్తేనే అడ్మిషన్లు ఇస్తామనే ప్రైవేట్ యాజమాన్యాల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పుడు.. అదే నివేదిక ఆధారంగా కనీస ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారని విజయశాంతి తెలిపారు. ఇదే విషయాన్ని కొద్దిరోజుల క్రితం జరిగిన శాసనమండలి (శాసన మండలి) సమావేశాల్లో కూడా తాను ప్రస్తావించినట్లు ఆమె గుర్తుచేశారు. తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం చెల్లించే ప్రజల సొమ్ముకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని, మెరుగైన విద్యా ప్రమాణాలతో తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Next Story