పీఆర్సీ‌పై స్పష్టత ఏదీ?.. ఒక్క డీఏతో చేతులు దులుపుకోవడం సరికాదు : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శలు

by Ramesh Naini |

రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను క్లియర్ చేస్తారని ఆశగా ఎదురుచూస్తుంటే ప్రభుత్వం కేవలం ఒక్క డీఏను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు.

పీఆర్సీ‌పై స్పష్టత ఏదీ?.. ఒక్క డీఏతో చేతులు దులుపుకోవడం సరికాదు : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను క్లియర్ చేస్తారని ఆశగా ఎదురుచూస్తుంటే ప్రభుత్వం కేవలం ఒక్క డీఏను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు. సర్కారు తీరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన డీఏల ఊసే ఎత్తకపోవడం, ముఖ్యంగా పీఆర్సీ మంజూరుపై సీఎం ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని మంజూరు చేయాలని, పెండింగ్ డీఏ లన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన డీఏ వాస్తవానికి గత నెలలోనే ఇవ్వాల్సి ఉందని, అంతకు ముందు గత ఏడాది జూలైలోనే ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.

మిగతా బకాయిలపై క్లారిటీ ఎప్పుడు..?

ఇప్పుడు ఒక డీఏ ఇచ్చినా, రేపో మాపో కేంద్రం కొత్త డీఏ ప్రకటిస్తుందని, దీంతో పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా బకాయిలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా ఇస్తామనడం మంచిదే అయినా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈహెచ్‌ఎస్ విధివిధానాలపై సీఎం రేవంత్​ రెడ్డి మౌనం వీడాలన్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి, గత ప్రభుత్వం కంటే మెరుగైన ఫిట్‌మెంట్‌తో రెండో వేతన సవరణను అమలు చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం, ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్ని సౌకర్యాలు కల్పించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.

Next Story