కావాలనే సెలవు రోజు చూసి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు: మధుసూదనాచారి

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ నేతలపై పెడుతున్న అక్రమ కేసులను న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొంటామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు.

కావాలనే సెలవు రోజు చూసి కౌశిక్‌రెడ్డిని  అరెస్టు చేశారు: మధుసూదనాచారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలపై పెడుతున్న అక్రమ కేసులను న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొంటామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే శని, ఆదివారాలు కోర్టుకు సెలువు రోజులను చూసి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిందన్నారు. రెండు రోజులైనా జైల్లో పెట్టాలని కుట్ర చేశారని అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ఆయనను రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. ఇప్పటికే కౌశిక్‌పై ఎన్నో అక్రమ కేసులు బనాయించారని.. కోర్టుల్లో ఈ ప్రభుత్వానికి వరస ఎదురుదెబ్బలు తగిలినా నవ్విపోదురు కాక నాకేమి సిగ్గు అనే రీతిలో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హామీల అమలు చేతకాక అక్రమ అరెస్టులకు దిగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వరుసగా తప్పులు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల చేతిలో శిక్ష తప్పదని పేర్కొన్నారు.

Next Story