- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్లపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు.. MLC కోదండరాం సీరియస్
గోదావరి-జనకచర్ల కుట్రకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బీజాలు పడ్డాయని.. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన ఆయన బేసిన్లు లేవు భేషజాలు లేవని ఆంధ్ర పాలకులకే వంతపాడారని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి-జనకచర్ల కుట్రకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బీజాలు పడ్డాయని.. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన ఆయన బేసిన్లు లేవు భేషజాలు లేవని ఆంధ్ర పాలకులకే వంతపాడారని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను బలిపెట్టారని అన్నారు. బనకచర్లపై మాట్లాడే కనీస నైతికత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన పార్టీకి లేదని అన్నారు. శుక్రవారం టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణకు నష్టం జరిగిందని.. ఎత్తున ఉన్నదనే నెపంతో తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదని అన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రజలు బావులు, బోర్ల మీద ఆధారపడాల్సి వచ్చిందన్నారు. గోదావరి (బచావత్) ట్రిబ్యునల్ ముందు కూడా రాష్ట్ర అవసరాలను నివేదించినప్పుడు తెలంగాణ ప్రయోజనాలను లెక్కలోకి తీసుకోలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఆందోళనల తర్వాత చేపట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం నత్తనడకన సాగిందని.. నిర్మాణం జరిగాక కూడా ధవళేశ్వరానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గానే మార్చారని చెప్పారు.
ఫలితంగా తెలంగాణలో గోదావరి నీటి వినియోగం తక్కువగా ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో నదీ జలాల యాజమాన్యానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారని.. ఈ చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్యానికి విడివిడిగా బోర్డులను ఏర్పాటు చేశారని.. వాటిని పర్యవేక్షించడానికి, నీటి కేటాయింపుల అంశాన్ని నిర్ణయించడానికి అపెక్స్ కౌన్సిల్ ఏర్పడిందన్నారు. 84, 85 సెక్షన్ల ప్రకారం కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను బోర్డు పరిశీలిస్తుందని.. బోర్డు సూచనల మేరకు అపెక్స్ కౌన్సిల్ కొత్త ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కానీ.. ఈ చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల కోసం నేరుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిందన్నారు. ఇది విభజన చట్టానికి విరుద్ధమని.. తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
పోలవరం-బనకచర్ల ద్వారా నీటిని గోదావరి బేసిన్ దాటి పెన్నా బేసిన్లో వాడుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నదని.. బనకచర్ల నిర్మాణం జరిగితే తెలంగాణ గోదావరి జలాల్లో తన వాటాను శాశ్వతంగా కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి గోదావరి జలాల్లో ఆంధ్రాకు 518 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీల నీటి హక్కు ఉందని.. కానీ ఇప్పటికే ఆంధ్ర ప్రాంతం సుమారు 630 టీఎంసీల గోదావరి నీటిని వాడుతున్నారని పేర్కొన్నారు. ఈ కొత్త ప్రాజెక్టు నిర్మాణం ద్వారా అదనంగా మరొక 300 టీఎంసీల దాకా నీటిని తరలించుకునే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుంట్ల ధర్మార్జున్, బైరి రమేశ్, డా.నిజ్జన రమేశ్ ముదిరాజ్, గోపగాని శెంకర్ రావు, పల్లె వినయ్ కుమార్, నర్సయ్య పాల్గొన్నారు.






