అదే కాంగ్రెస్‌ నైజమని తేలిపోయింది: MLC

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసే కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.

అదే కాంగ్రెస్‌ నైజమని తేలిపోయింది: MLC
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసే కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. శనివారం తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని 30 కోట్ల మంది మైనార్టీలపై తమది కపట ప్రేమేనని ఎన్నికల గాంధీలు నిరూపించుకున్నారన్నారు. అత్యంత కీలకమైన వక్ఫ్‌ చట్టసవరణ బిల్లుపై లోక్‌ సభలో చర్చ సందర్భంగా మాట్లాడకుండా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఖామోష్‌ అయ్యారని, ప్రియాంకా గాంధీ అసలు సభకే హాజరు కాకుండా డుమ్మా కొట్టారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వక్ఫ్‌ బిల్లు సందర్భంగా లోక్‌ సభలో వెన్ను చూపారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలిద్దరికీ మైనార్టీలు, ముస్లింల సంక్షేమం, సమస్యలంటే పట్టవని అర్థం అయ్యిందన్నారు. టోపీలు పెట్టుకొని ఓట్లడిగి గద్దెనెక్కిన తర్వాత మైనార్టీలను నిండా ముంచడమే కాంగ్రెస్‌ నైజమని తేలిపోయిందన్నారు.


దేశంలో మైనార్టీల హక్కులను కాపాడేది కాంగ్రెస్‌ పార్టీయేనని రాహుల్‌ గాంధీ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారని, వక్ఫ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఎటు వెళ్లారో, సభలో మైనార్టీల పక్షాన గొంతు ఎందుకు విప్పలేదో చెప్పాలన్నారు. ఇద్దరు గాంధీలు లోక్‌ సభ సభ్యులుగా ఉండి మైనార్టీల తరపున వక్ఫ్‌ బిల్లుపై మాట్లాడలేదంటే ఇది ముస్లింలను నట్టేట ముంచడం కాదా అని ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్‌ మొదటి నుంచి ఒకే స్టాండ్‌ తో ఉందన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్‌ చట్టసవరణ బిల్లును రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందన్నారు. మైనార్టీలకు అండగా నిలవాల్సిన సమయంలో రాహుల్‌ గాంధీ వెన్ను చూపించారని.. కీలకమైన సమయంలో మైనారిటీలకు అండగా లేని ప్రధాన ప్రతిపక్షనేత రేపు మైనార్టీలు, ముస్లింలకు ఎలా అండగా నిలుస్తారని నిలదీశారు.

Next Story