ఇంకా దున్నపోతు మీద వానపడ్డట్టే వారి తీరు: ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సోషల్ మీడియా(X) వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

ఇంకా దున్నపోతు మీద వానపడ్డట్టే వారి తీరు: ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సోషల్ మీడియా(X) వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం, స్వాతంత్ర్య సమరయోధుడు దాశరథిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సోయి ఏమాత్రం లేని ప్రభుత్వం తెలంగాణను పాలిస్తుండటం విచారకరమన్నారు. శుక్రవారం దాశరథిని నిర్బంధించిన ఖిల్లా రామాలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు.

దాశరథి శత జయంతి(Dasarathi Jayanthi) సందర్భంగా ఆయన గొప్పతనాన్ని రేపటి తరాలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని తాను పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరామన్నారు. అయినా దున్నపోతు మీద వానపడ్డట్టుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. జులై 22న దాశరథి శత జయంతి ఉందని.. ఈ రోజు నుంచి ఆయన జయంతి రోజు వరకైనా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాశరథి స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. దాశరథి శత జయంతి ఉత్సవాలపై ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందో జూలై మొదటి వారం వరకు వేచి చూస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే జులై 21, 22 తేదీల్లో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున దాశరథి శత జయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు, ఉద్యమకారులను పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శత జయంతి సందర్భంగా దాశరథిని ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుందని.. తాము మరోసారి ఇదే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని అన్నారు. చరిత్ర హీనులుగా మిగలవద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు.


Next Story