- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్‌లోని దెయ్యాల పేర్లు బయటపెట్టిన కవిత.. కేసీఆర్ స్పందనపై అందరిలోనూ ఉత్కంఠ!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు పార్టీలో మరోసారి కలకలం రేపాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు పార్టీలో మరోసారి కలకలం రేపాయి. నిన్నమొన్నటి వరకు కాళేశ్వరంపైనే అందరిలోనూ ఉత్కంఠ వాతావరణం కనిపించగా, తాజాగా కవిత చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఏకంగా ఆమె మాజీ మంత్రి హరీశ్‌రావును టార్గెట్ చేసి మాట్లాడడంతో ఒక్కసారిగా పార్టీలో అలజడి చెలరేగింది. హరీశ్‌రావు, సంతోష్‌రావులు అవినీతి అనకొండలంటూ, కేసీఆర్ వెంటే ఉంటూ వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర విమర్శలు చేశారు. వీరి కారణంగానే ఇప్పుడు కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవలసి వస్తున్నదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అవినీతి లేదన్న బీఆర్ఎస్
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ వస్తున్నది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్‌రావు పాత్ర లేదా? అని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ చేసిన కామెంట్స్ అబద్ధమా..? కవిత చెప్పిన మాటలు నిజమా..? అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. అసలైన అవినీతిపరులు మాజీమంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావు అని.. వీరి మీద ఎందుకు విచారణ చేపట్టరంటూ ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించడం.. ఆమె ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్లయ్యింది. దీంతో ఈ విషయంలో బీఆర్ఎస్ ఇరుకున పడింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై కవిత మాట్లాడడంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు ఆదేశించి, 24 గంటలైనా గడవకముందే కవిత ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి.
హరీశ్, సంతోష్ టార్గెట్
పార్టీలో కొన్ని రోజులుగా తనపై కుట్ర జరుగుతున్నదని, దీనంతటికి హరీశ్‌రావు, సంతోష్‌రావు కారణమంటూ కవిత ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయింది. ఆ అంశంపైన కవిత సీరియస్ అయ్యారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఎయిర్‌పోర్టులోనే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కామెంట్ చేశారు. వారి కారణంగానే పార్టీ ఓడిపోవాల్సి వచ్చిందంటూ చెప్పారు. అయితే ఆమె ఎప్పుడూ కూడా వారి పేర్లు బయటపెట్టలేదు. అయితే ఇప్పుడు ఆమె ఆ దెయ్యాల పేర్లను వెల్లడించారు. హరీశ్‌రావు, సంతోష్‌రావును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కేసీఆర్ పై అవినీతి మరక రావడానికి వీరిద్దరే కారణమంటూ మాట్లాడారు.
పార్టీ ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే..
తన తండ్రిపై సీబీఐ విచారణ చేపట్టే వరకూ వచ్చిందంటే పార్టీ ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటేనంటూ కవిత వ్యాఖ్యానించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగానూ క్యాడర్‌లో చర్చకు దారితీశాయి. అటు హరీశ్‌రావు, సంతోష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత.. పార్టీ విషయంలోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. అధినేత కుమార్తె అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగగా.. సాయంత్రం కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి, క్యాడర్‌ను అయోమయానికి గురిచేశాయి.
Read More : బీఆర్ఎస్‌కు షర్మిల పాపం






