MLC Kavitha: జగదీష్ రెడ్డి ఓ లిల్లీపుట్.. కార్తీక్ రెడ్డి పిల్ల నాయకుడు.. కవిత ఘాటు విమర్శలు

by Prasad Jukanti |

జగదీష్ రెడ్డి ఓ లిల్లీపుట్, కార్తీక్ రెడ్డి పిల్ల నాయకుడని కవిత ఘాటు విమర్శలు చేశారు.

MLC Kavitha: జగదీష్ రెడ్డి ఓ లిల్లీపుట్.. కార్తీక్ రెడ్డి పిల్ల నాయకుడు.. కవిత ఘాటు విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : ‘నల్లగొండ లిల్లీపుట్ నా గురించి మాట్లాడతారా?’ అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హాట్ కామెంట్స్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy), మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్‌రెడ్డిలపై (Karthik Reddy) పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారా‌హిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘కవిత ఎవరని నల్లగొండ లిల్లీపుట్ (Lilliput) నాయకుడు మాట్లాడుతున్నాడు. ఆ జిల్లాలో బీఆర్ఎస్‌ నాశనం కావడానికి కారణమే ఆ లిల్లీపుట్ నాయకుడు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు? నా గురించి మాట్లాడుతున్నాయన చావు తప్పి కన్నులొట్టబోయినట్లు చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచాడు. ఎన్నడూ ప్రజాఉద్యమాలు చేయలేదు.’ అని అన్నారు. ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడగానే నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినవారు, పిల్ల నాయకుడు కూడా ఎటుపడితే అటు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అసలు మీరు ఎవరు? తెలంగాణ ఉద్యమంతో మీకేం సంబంధం? మీ మీదనే కదా మేం కొట్లాడింది. పార్టీలో చేరి పదవులు పొంది ఉల్టా నామీదనే మాట్లాడుతారా? అంటూ మండిపడ్డారు.

ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను..

తనపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్‌లోని ఓ పెద్ద నేత హస్తం ఉన్నదని కవిత ఆరోపించారు. తనను కించపరిచేలా మాట్లాడితే యావత్ తెలంగాణ బాధపడిందని, కానీ బీఆర్ఎస్‌లోని ఒక్కరు కూడా స్పందించలేదని అన్నారు. ‘ఆ పెద్ద నేత నా దగ్గర అతని మనుషులను పెట్టి సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తుందన్నది ఆ పెద్ద నాయకుడికి అర్థం కావాలి’ అని పేర్కొన్నారు. మీరు ఏ సమయంలో ఎవరిని కలిశారో, ఎవరిని ప్రోత్సహించారో.. నాపై కించపరిచే వ్యాఖ్యలు చేయించారో ఇవన్నీ తాను గమనిస్తున్నానని స్పష్టం చేశారు. భయపడే వ్యక్తిని కాదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను కేసీఆర్‌కు రాసిన లేఖ ఏ విధంగా బహిర్గతం అయింది తనకు తెలుసని అన్నారు.

కాంగ్రెస్, బీజీపీ కలిసి నాటకాలు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బీజీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని కవిత ఫైర్ అయ్యారు. ఆర్డినెన్సు‌పై బీజేపీ స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడలేదని, వీరు అడిగితే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వరా అని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపటి నుంచి చేసే 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

Next Story