- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC కవిత మరో కీలక నిర్ణయం.. యువతకే ప్రాధాన్యత అంటూ ప్రకటన
సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తుందన్నారు. కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతున్నదని, వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40 వేల మందికిపైగా కార్మికులు పనిచేస్తుంటే వారిలో సగానికిపైగా యువకులే ఉన్నారని చెప్పారు.
సింగరేణి స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ పెట్టాలి
సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి.. వాటిలో సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యాబోధన చేయాలని కవిత డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. భూగర్భ గనుల్లో ఎస్డీఎల్ వెహికిల్స్‌ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా.. ప్రైవేటు వాళ్లతో నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇది ఓపెన్ కాస్టుల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎఫ్‌టీ నిధులను కార్మికులకు వసతుల కోసం వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని వెల్లడించారు. జైపూర్ పవర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 వేల కోట్లతో ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే రూ.9 వేల కోట్లకు పెంచిందన్నారు. సంస్థను తమ అవినీతితో ఈ ప్రభుత్వం దెబ్బతీయాలని చూస్తుందన్నారు. ఎక్స్‌ప్లోజివ్స్ టెండర్లలోనూ భారీ అక్రమాలకు పాల్పడ్డారని, ఏకంగా టెండర్‌ను మూడు రెట్లు పెంచారని తెలిపారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామన్నారు.
కార్మికుల సమస్యలపై గనులపై కూర్చుంటా..
సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ కోసం పనిచేస్తున్నారని.. అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదని కవిత అన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు జీఎం స్థాయిలో చేస్తారని.. సీఎం తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ హైదరాబాద్‌కు పిలిపించి అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న మారు పేర్ల సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారి తరఫున సింగరేణి జాగృతి ఉద్యమిస్తుందన్నారు. కార్మికుల కోసం తాను స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల వరకూ వచ్చి కూర్చుంటానని భరోసా ఇచ్చారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను నియమించారు. బెల్లంపల్లి ఏరియాకు కిరణ్ ఓరం, శ్రీరాంపూర్‌కు కుర్మ వికాస్, మందమర్రికి ఎస్.భువన్, రామగుండం1కు బొగ్గుల సాయికృష్ణ, రామగుండం 2కు కె.రత్నాకర్ రెడ్డి, రామగుండం 3కి దాసరి మల్లేశ్, భూపాలపల్లికి నరేశ్ నేత, మణుగూరుకు అజ్మీరా అశోక్ కుమార్, కొత్తగూడెంకు వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్, కార్పొరేట్‌కు వసికర్ల కిరణ్ కుమార్, ఎస్‌టీపీపీ పవర్ ప్లాంట్‌కు కె.రామ్మోహన్ చారిని నియమించారు.






