వందలాది మంది ఎదురుచూస్తున్నారు.. సర్కార్‌ ఎదుట ఎమ్మెల్సీ కవిత కీలక డిమాండ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-09 17:21:32  IST  )

సింగరేణిలో మారు పేర్ల (అలియాస్ నేమ్స్)తో కార్మికులుగా పనిచేసి డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

వందలాది మంది ఎదురుచూస్తున్నారు.. సర్కార్‌ ఎదుట ఎమ్మెల్సీ కవిత కీలక డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలో మారు పేర్ల (అలియాస్ నేమ్స్)తో కార్మికులుగా పనిచేసి డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సింగరేణి జాగృతి నాయకులు, అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సంస్థలో 30 ఏళ్లకు పైగా సేవ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం అన్యాయమన్నారు. తండ్రులు అలియాస్ నేమ్స్‌తో పనిచేస్తే వారసులకు రెండు ఇంటి పేర్లు ఉన్నాయనే కారణంతో ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు.

అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిని విజిలెన్స్ విభాగం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నదని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం వందలాది మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. యాజమాన్యం మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కోరారు. సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్ వద్ద చేసుకున్న ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు సింగరేణి జాగృతి నాయకులు సంస్థ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ సుభానిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనచారి, తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ నరేన్ అప్పల, టీబీజీకేఎస్ కేంద్ర కోశాధికారి వెంకట్, సింగరేణి జాగృతి నాయకులు నరేష్ నేత, భువనచంద్ర, అనిల్ సందీప్ గౌడ్, సునీల్, శ్రీకాంత్, మారుపేరు బాధితులు పాల్గొన్నారు.

Next Story