ప్రధానితో CM రేవంత్‌కు ఉన్న లాలూచీ ఏంటి?: MLC కవిత

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-11 16:50:11  IST  )

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని.. కలిసి వచ్చే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.

ప్రధానితో CM రేవంత్‌కు ఉన్న లాలూచీ ఏంటి?: MLC కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని.. కలిసి వచ్చే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు, ఇతర బీసీ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తున్నదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పటికైతే అమలు చేయమని చెప్పడమేనని అన్నారు. ఇదే విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత బీసీలను వంచించాలనే చూస్తున్న కాంగ్రెస్ కుయుక్తులను ప్రజల ముందు ఎండగడుతామని చెప్పారు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కంటితుడుపు చర్య మాత్రమే అని తెలిపారు. ప్రధాని దగ్గరకు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న లాలూచీ ఏంటి? అని నిలదీశారు.

ప్రజాపాలన అంటే ఇదేనా?

ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చి వీల్ చైర్ నుంచి కిందపడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గమని కవిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల కలెక్టర్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story