Bhim Army: రైల్ రోకో కార్యక్రమానికి భీమ్ ఆర్మీ మద్దతు.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-07-05 12:47:48  IST  )

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో (Rail Roko) కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.

Bhim Army: రైల్ రోకో కార్యక్రమానికి భీమ్ ఆర్మీ మద్దతు.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో (Rail Roko) కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకోకు భీమ్ ఆర్మీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. శనివారం భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ ఆయాజ్ ఆధ్వర్యంలో నాయకులు బంజారాహిల్స్‌లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. రైల్ రోకోకు భీమ్ ఆర్మీ చీఫ్, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మద్దతు ప్రకటించారని తెలిపారు. రైల్ రోకోలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు సాధించడంతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడం ఒక్కటే మార్గమన్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపినా.. నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారని వాపోయారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రిజర్వేషన్లు కల్పించకుంటే కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్తామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, హన్మంతరావు, సురేశ్ కుమార్, యూపీఎఫ్ కో-ఆర్డినేటర్ ఆలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.

Next Story