అప్పటి వరకు విచారణకు హాజరు కాలేను: ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్

by Disha Web Desk 19 |
అప్పటి వరకు విచారణకు హాజరు కాలేను: ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఈడీ ఎంక్వయిరీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగట్లేదు. అందుకే విచారణ నుంచి ఉపశమనం కలిగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు వ్యక్తిగతంగా హాజరు కాను. అవసరమైతే ఇంట్లో విచారించుకోవచ్చు.’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం విచారణకు హాజరు కాకుండా, ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నందున దాన్ని దృష్టిలో పెట్టుకుని తదుపరి విచారణ తేదీని ఖరారు చేయాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్‌ను కోరారు.

ఈడీ విచారణకు హాజరు కావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ‘రూల్ ఆఫ్ లా’ అమలు పటిష్టంగా ఉండాలని తెలిపారు. ఒక మహిళను విచారించాలనుకున్నప్పుడు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని మెయిల్‌లో పేర్కొన్నారు. కానీ కచ్చితంగా ఈడీ హెడ్ క్వార్టర్‌కు రావాలని ఒత్తిడి చేయడంపై సుప్రీంకోర్టులో 2018లోనే ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని, అది ఇంకా విచారణలోనే ఉన్నదని గుర్తు చేశారు. ఆ కేసులో ఈడీ తరఫున కూడా వాదనలు జరిగాయని, అప్పుడు మహిళను విచారించాల్సి వస్తే తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేయబోమంటూ కోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని మెయిల్‌లో తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా..

ఈ నెల 11న విచారణ సందర్భంగా తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఈడీ వ్యవహరించిందని కవిత ఈ మెయిల్‌లో ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 8.30 గంటల వరకు తనను ఎంక్వయిరీ చేశారని తెలిపారు. విచారణ మరో వ్యక్తితో జాయింట్‌గా ఉంటుందని పేర్కొన్న ఈడీ చివరకు ఒంటరిగా మాత్రమే తనను ప్రశ్నించిందన్నారు. ఇదే విషయాన్ని ఆఫీసు సిబ్బంది భానుప్రియ మీనాతో చర్చించానని, ప్లాన్ మారిందంటూ సమాధానం ఇచ్చారని మెయిల్‌లో పేర్కొన్నారు.

విచారణకు హాజరయ్యేటప్పుడు ఫోన్‌‌ను తీసుకురావాలంటూ నోటీసులో ఈడీ ఎక్కడా పేర్కొనలేదని, అయినా అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ‘రైట్ టు ప్రైవసీ’కి విరుద్ధంగా తన ఫోన్‌లోని వివరాలను ఈడీ తన పరిధిలోకి తీసుకున్నదని, ఇది చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. చివరకు తన చేత బలవంతంగా అండర్‌ టేకింగ్‌ పత్రంపైన సంతకం తీసుకున్నారని గుర్తుచేశారు. లిక్కర్ స్కామ్ విషయంలో ప్రశ్నిస్తున్నందున ఆ కేసుతో తన ఫోన్‌ కు ఉన్న సంబంధం గురించి ఈడీ వివరించలేదని పేర్కొన్నారు. ఆ కారణంగానే విచారణ నోటీసులను రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరినట్లు కవిత మెయిల్‌లో పేర్కొన్నారు.

20న ఎంక్వయిరీకి రావాలని మళ్లీ నోటీసులు

సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌లో ఉత్తర్వులు వెలువడేంత వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలంటూ మెయిల్ ద్వారా కవిత కోరినప్పటికీ ఈ నెల 20న రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీచేయడం గమనార్హం. అయితే ఆ నోటీసు ప్రకారం కవిత విచారణకు హాజరవుతారా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. హాజరుకాని పక్షంలో ఈడీ ఎలా స్పందిస్తుందన్నది కూడా ఈడీకి సవాలుగా మారింది. కాగా, గురువారం ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిన తర్వాత, న్యాయవాది సోమా భరత్‌ ను కవిత తన ప్రతినిధిగా పంపారు.

ఎవరీ సోమా భరత్?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత తరఫున ఈడీ ముందుకు న్యాయవాది సోమా భరత్ వెళ్లారు. కవిత వాదనలను లిఖిత పూర్వకంగా అందించారు. దీంతో ఒక్కసారిగా సోమా భరత్ పేరు చర్చనీయాంశమైంది. సూర్యాపేట జిల్లా వర్థమానుకోటకు చెందిన భరత్ 2001 నుంచి గులాబీ పార్టీలో ఉన్నారు. చాలా మంది తమకు పార్టీలో సరైన అవకాశం రాలేదని ఇతర పార్టీల్లోకి వెళ్లినా, భరత్ మాత్రం తెలంగాణ భవన్ కే పరిమితమయ్యారు. అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి న్యాయసేవలు అందిస్తున్నారు. ఈయన పనితీరు చూసిన సీఎం కేసీఆర్ మునుగోడు బై ఎలక్షన్ తర్వాత ఆయన్ను డెయిరీ డెవలప్ మెంట్ కో అపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కు చైర్మన్ గా నియమించారు. ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచి నిత్యం ప్రగతిభవన్ కు టచ్ లో ఉండే లీగల్ ఎక్స్ పర్ట్స్ టీమ్ లో భరత్ కూడా ఓ మెంబర్ గా కొనసాగుతున్నారు.

Also Read..

ఎమ్మెల్యేలకు టార్గెట్? అన్వార్డ్ ఫ్లైట్.. రిటర్న్‌లో ట్రైన్


Next Story