కొండగట్టు అంజన్న ఆశీస్సులే.. పవన్ కల్యాణ్‌‌పై దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కొండగట్టు అంజన్న ఆశీస్సులే.. పవన్ కల్యాణ్‌‌పై దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) నిధులతో చేపట్టిన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగడంపై తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన తెలిపారు. 2009లో హుస్నాబాద్ ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన తీవ్ర విద్యుత్ ప్రమాదం నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాణాలతో బయటపడటం వెనుక కొండగట్టు అంజన్న ఆశీస్సులే ఉన్నాయనే గట్టి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అది కేవలం అదృష్టం కాదని, సాక్షాత్తు కొండగట్టు అంజన్న చూపిన అద్భుతమని పేర్కొన్నారు.

తనకు పునర్జన్మనిచ్చిన క్షేత్రం

తనకు పునర్జన్మనిచ్చిన క్షేత్రంపై కృతజ్ఞతతో, అచంచలమైన భక్తి విశ్వాసాలతో పవన్ కల్యాణ్ ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చారని దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆలయ పరిధిలో దీక్షా విరమణ మండపం, సత్రం నిర్మాణానికి రూ. 35.19 కోట్ల TTD నిధులతో శంకుస్థాపన చేయడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను చాటుతూ ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంజన్న ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఈ నిధుల మంజూరుకు చొరవ చూపి సహకరించిన TTD ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story