‘లోకల్’ ఫైట్ తర్వాతే ఎమ్మెల్సీ బైపోల్.. అడ్డొస్తున్న ఎన్నికల నిబంధనలు

by Kema Shiva Kumar |

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

‘లోకల్’ ఫైట్ తర్వాతే ఎమ్మెల్సీ బైపోల్.. అడ్డొస్తున్న ఎన్నికల నిబంధనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. చైర్మన్ ఫార్మాట్‌లో ఆమె రాజీనామా చేయగా.. త్వరలోనే ఆమోదం పొందుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కవిత రాజీనామా లేఖ ఇప్పటికే శాసనమండలి చైర్మన్​ కార్యాలయానికి చేరింది. చైర్మన్‌తో ఆమె స్వయంగా మాట్లాడక రాజీనామా ఆమోదం పొందే అవకాశం ఉంది. అందుకోసం చైర్మన్​ అపాయింట్‌మెంట్‌ను కవిత కోరగా.. వచ్చే వారం ఆమోదం పొందుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ​స్థానిక సంస్థల ఉపఎన్నికపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎవరికి వారు సీటు దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితేనే..

నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ ఉపఎన్నికను ఇప్పట్లో నిర్వహించలేమని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న స్తానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022 జనవరి 5వ తేదీన ఆమె ఎన్నికయ్యారు. ఆమె పదవీకాలం 2028 జనవరి 4తో ముగియనుంది. వాస్తవంగా ఆమె పదవీకాలం మరో 27 నెలలు ఉంది. అయితే, తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్​ స్థానిక సంస్థల సెగ్మెంట్‌కు ఉపఎన్నిక నిర్వహించాలంటే కనీసం 75 శాతం ఓటర్లు ఎన్నికై ఉండాలి. స్థానిక సంస్థల్లో ఓటు వేసే అర్హత ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్​ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సంబంధించిన అన్ని స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతం నిర్వహించాల్సి ఉంది. ఈ రెండింటి ఎన్నికలు జరిగితే కానీ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవు.

811 స్థానాలు..

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మొత్తం 596 ఉన్నాయి. మున్సిపాలిటీల పరిధిలో 215 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. ఇలా మొత్తం జిల్లాలో 811 స్థానాలు ఉండగా.. వీటిలో కనీసం 75 శాతం వరకు సీట్లకు ఎన్నికలు జరిగి సభ్యులు ఎన్నికై ఉండాలి. అనగా కనీసం 608 మంది సభ్యులు ఎన్నికల్లో గెలుపొందాల్సి ఉంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో మొత్తం 608 ఎన్నికై ఉండాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు పూర్తయినా 596 మంది సభ్యులు మాత్రమే ఎన్నికవుతారు. దీంతో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు రెండింటికీ ఎన్నికలు పూర్తయితే కానీ ఉపఎన్నిక సాధ్యం కాదు. అప్పటివరకు ఆ స్థానం ఖాళీగానే ఉండనుంది.

Next Story