- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Kumar Goud : ఎమ్మెల్యేల పనితీరు సరిగాలేదు : టీపీసీసీ చీఫ్ ఆగ్రహం
టీపీసీసీ అధ్యక్షుడు(TPCC Cheif) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : టీపీసీసీ అధ్యక్షుడు(TPCC Cheif) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పనితీరును సమీక్షించుకొని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడిపి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈనెలలోనే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని.. దీనికి సంబంధించి చర్చలు ఢిల్లీలో ఏఐసీసీ అధిష్ఠానంతో జరిగాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అందుతున్నాయని, తెలంగాణలో జరిగిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అయితే, పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పనిచేయాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలపరచాలని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌లో పాత నాయకులు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన కొత్త ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నామని, కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.
తెలంగాణ మంత్రివర్గంలో 18 మంది సభ్యులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు, మిగిలిన ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి ఏఐసీసీతో చర్చలు జరుగుతున్నాయని, ఈ విస్తరణలో కుల, ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. టీపీసీసీ కార్యవర్గ విస్తరణలో బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో ఐక్యతను కాపాడటం, స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడం, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడమే తన లక్ష్యమని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేస్తామని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ఆకాంక్షతో పనిచేస్తామని ఆయన ఉద్ఘాటించారు.






