మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు గరం..! శాఖలు మార్చాలని హైకమాండ్‌కు ఫిర్యాదు

by Kema Shiva Kumar |

మంత్రులపై విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కోపంగా ఉండటం సహజం.

మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు గరం..! శాఖలు మార్చాలని హైకమాండ్‌కు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రులపై విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కోపంగా ఉండటం సహజం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లే కొందరు మంత్రులపై గుర్రుగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. సదరు మంత్రుల దగ్గర నుంచి ఆ శాఖలను తప్పించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సంబంధిత మంత్రులపై వారు కంప్లయింట్ చేసినట్లు తెలిసింది.

ఇంటికి వెళ్తే గంటల కొద్ది కూర్చోబెడుతున్నారు

తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ఆ ముగ్గురు మంత్రుల వద్దకు వెళ్తే రిసీవ్ చేసుకునే విధానం సరిగా ఉండటం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వెళ్తే వెంటనే కలవకుండా గంటల కొద్ది కూర్చోబెడుతున్నారని, చివరకు కలిసినా పొడిపొడిగా మాట్లాడుతున్నారని, అందులోనూ అవహేళన మాటలు ఎక్కువగా ఉంటున్నాయని, ఇలా ఇప్పటికే ఐదారుసార్లు జరిగిందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. తాము పైరవీల కోసమో, సొంత పనుల కోసమో మంత్రుల వద్దకు వెళ్లడం లేదని, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం తన ఒక్కరికే కాదని, కొత్తగా ఎన్నికైన మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఉందని ఆయన వివరించారు.

అధిష్టానానికి ఫిర్యాదు

సదరు మంత్రుల పనితీరుపై విసిగి పోయిన కొందరు యువ ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం లిఖిత పూర్వకంగా కంప్లైట్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే వివరించారు. ‘మేం కూడా వాళ్లతో సమానంగా ఎమ్మెల్యేలమే. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచాం. మాకే టైం ఇవ్వకపోతే, సాధారణ ప్రజలను ఎలా కలుస్తారు?’ అని ప్రశ్నించారు.

సీనియర్ లీడర్లకు సైతం అదే అనుభవం

పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సైతం సదరు మంత్రులు టైం ఇవ్వడం లేదనే ఫిర్యాదులున్నాయి. ‘ఆ మంత్రులకు చాలా గర్వం. ఫోన్ లిఫ్ట్ చెయ్యరు. వెళ్తే కలవరు. ఇట్లా ఉంటే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తది. వాళ్లను ఆయా శాఖల నుంచి తప్పించాలి. కొత్త వాళ్లకు కేటాయించాలి’ అని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ లీడర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ఈ విషయాలపై పార్టీ పెద్దలకు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు.

Next Story