ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. రేపు తుది తీర్పు వెల్లడించనున్న సుప్రీం కోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-30 15:03:55  IST  )

బీఆర్ఎస్ (BRS) పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్‌ (Congress) పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. రేపు తుది తీర్పు వెల్లడించనున్న సుప్రీం కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్‌ (Congress) పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు తేలనుంది. ఆ పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించబోతోంది. కాగా, తెలంగాణ స్పీకర్‌ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్‌ రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ త్రీన తీర్పును రిజర్వులో చేసింది.

కోర్టులో వాదనలు ఇలా..

గత విచారణలో అభిషేక్‌ మనుసింఘ్వీ తన వాదలను వినిపిస్తూ.. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ ‘మీ దృష్టిలో రీజనబుల్‌ టైమ్‌ అంటే ఏంటని సింఘ్వీని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాట్లాడిన మాటలను కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి ప్రస్తావించారు. ‘ఉప ఎన్నికలు రావు.. స్పీకర్‌ తరఫున కూడా చెబుతున్నా’ అంటూ ఆయన వ్యాఖ్యానించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారని చెప్పారు. దీనిపై జస్టిస్‌ గవాయ్‌ స్పందిస్తూ ‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా.. ఆయన అలా వ్యవహరిస్తే ఎలా అని ధర్మాసనం సీరియస్ అయింది. ఇక అభిషేక్‌ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా... సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ గవాయ్‌ కామెంట్ చేశారు. తాము సంయమనం పాటిస్తున్నామని.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలన్నారు.

Next Story