KTR : ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్లు హైడ్రకు కనిపించవు : కేటీఆర్

by Muthe.Rajitha |

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇల్లు బఫర్ జోన్లో ఉంటే హైడ్రా(HYDRAA) కళ్ళకు అవి కనిపించవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు.

KTR : ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్లు హైడ్రకు కనిపించవు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇల్లు బఫర్ జోన్లో ఉంటే హైడ్రా(HYDRAA) కళ్ళకు అవి కనిపించవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు కాంగ్రెస్ నాయకులంతా బ్లాక్మేయిల్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఇంటిని కూల్చివేసిన కాంగ్రెస్ కార్పోరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ నాయకుడు మహ్మద్ సర్దార్ కుటుంబాన్ని ఇవాళ కేటీఆర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు అక్రమంగా కట్టుకున్న ఏ ఒక్క ఇంటి జోలికి వెళ్లడానికి సాహసించని హైడ్రా, పేదల ఇళ్ల మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నదని విమర్శించారు. యూపీలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని గొంతుచించుకుంటున్న రాహుల్ గాంధీకి, తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా?అని ప్రశ్నించారు.

అధికారం కోల్పోయాక కూడా కేసీఆర్ సైనికుడిగా బీఆర్ఎస్ లోనే ఉన్న సర్దార్ ను కాంగ్రెస్ లోకి రావాలని స్థానిక కార్పోరేటర్ అధికారమత్తులో వేధించాడని కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారడానికి ఒప్పుకోకపోవడంతో కక్ష కట్టి సర్దార్ ఇంటిని, షాప్ ను కూల్చివేయించాడని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్న కేటీఆర్.. బీఆర్ఎస్ నేతలు, పేదల్ని వేధిస్తున్న కాంగ్రెస్ నేతల, అధికారుల హిసాబ్ కితాబ్ సెటిల్ చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఆడిచ్చినట్టు ఆడుతున్న అధికారులు ఇప్పటికైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు.

పదేళ్ల పాటు పేదల బతుకుల్ని మార్చడానికి పనిచేసిన తాము రేపు అధికారంలోకి వచ్చాక ఇలానే వ్యవహరిస్తే ఒక్క కాంగ్రెస్, బీజేపీ నేత కూడా రోడ్డు మీద తిరగలేడని హెచ్చరించారు. హైడ్రా, మూసీ,లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉన్నది కేసీఆర్ సైనికులేనని.. నేడు గద్వాల జిల్లా ధన్వాడలో రైతుల తరపున కూడా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ఏమైనా కక్షలు ఉంటే తమపై కేసులు పెట్టి జైలుకు పంపాలే కాని పేదల జోలికి రావద్దన్నారు.

పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బీఆర్ఎస్ కచ్చితంగా అడ్డుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్దార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్న కేటీఆర్, అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్తామన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన పిల్లల చదువు, భవిష్యత్తుకు భరోసాగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ కు ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మొత్తం పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Next Story