- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పార్టీ కార్యకర్తలు సీఎంను నమ్మొద్దు: ఎమ్మెల్యే వేముల
కాంగ్రెస్ పార్టీ వాళ్లు రేవంత్‌ను నమ్మొద్దని.. కాంగ్రెస్‌ను ఖతం చేసి ఆయన బీజేపీలోకి పోతారని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ వాళ్లు రేవంత్‌ను నమ్మొద్దని.. కాంగ్రెస్‌ను ఖతం చేసి ఆయన బీజేపీలోకి పోతారని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రుల శాఖల కేటాయింపు కోసం, కాంగ్రెస్ పార్టీ అధినేతల అపాయింట్ దొరక్క రెండు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసి ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని అన్నారు. గల్లీలో గలీజ్ దందాలు చేస్తూ.. ఢిల్లీలో గులాం గురిచేస్తున్నట్లు ఆయన తీరు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్, కిషన్‌రెడ్డి ఒక్కటే అని రేవంత్‌రెడ్డి అన్న మాట అబద్ధం, అవాస్తవమని.. రేవంత్‌రెడ్డి బీజేపీ ఒక్కటి అన్నది వాస్తవమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ ఎంపీలు గెలవడానికి రేవంత్‌రెడ్డి సహాయ పడ్డారని తెలిపారు. ఇదే విషయాన్ని స్వయంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వెలిచాల రాజేందర్‌కు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌పై పోటీకి నిలిపారని.. ఇలా బీజేపీ ఎంపీ అభ్యర్థులు గట్టిగా ఉన్న చోటా కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థులను తీసుకొచ్చి పెట్టిందన్నారు.
8 మంది బీజేపీ ఎంపీలలో ఏడుగురిని రేవంత్‌రెడ్డి గెలిపించారని అన్నారు. ఆ పార్టీ ఎంపీలు గెలిచిన చోట రేవంత్‌రెడ్డి మంత్రి పదవులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రధాని మోడీ ఎలక్షన్ ప్రచారంలో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని చెప్పినా.. ఈడీ, సీబీఐ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు ఎటుపోయిందని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ దొరకదు కానీ.. ప్రధానిని కలిసేందుకు 15 నిమిషాల్లో ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. బండి సంజయ్ ఓపెన్‌గానే రేవంత్‌రెడ్డిని పదవి కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ బీజేపీలో జాయిన్ అయితే స్వాగతిస్తామని ఎంపీ అరవింద్ అంటున్నారని.. ఇది రేవంత్, బీజేపీ దోస్తానకు సంకేతం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడుతున్న సందర్భంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన శత్రువు రేవంత్ అని దుయ్యబట్టారు. మూడు రోజుల్లో కాళేశ్వరంపై మాట్లాడుతా అని అంటున్నారని.. అబద్ధాల ప్రెజెంటేషన్ వంటకం ఇంకా సిద్ధం కాలేదా అని నిలదీశారు. రేవంత్ ఇప్పటికైనా పిట్టల దొర మాటలు బంద్ చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకూ వెంట పడుతూనే ఉంటామని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి కర్రు కాల్చి వాత పెడుతారని అన్నారు.






