- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మరోసారి ఈడీ విచారణకు MLA రోహిత్ రెడ్డి!
మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ అధికారుల విచారణకు సోమవారం హాజరయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ అధికారుల విచారణకు సోమవారం హాజరయ్యారు. తొలి రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి కంటిన్యూగా ఆరు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానాల అనంతరం స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. మరోసారి మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా రోహిత్‌రెడ్డిని ఈడీ ఆఫీసర్లు ఆదేశించారు. విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పిన రోహిత్‌రెడ్డి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు మీడియాకు వివరించారు. వ్యక్తిగతమైన వివరాలతో పాటు కుటుంబ సభ్యుల గురించి, మొత్తంగా తాము చేస్తున్న వ్యాపారాల గురించి అధికారులు వివరాలు తీసుకున్నారని పైలట్ వివరించారు.
దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించినా నిర్ధిష్టంగా ఏ కేసుకు సంబంధించి విచారణకు పిలిచారో తనకు అర్థం కాలేదని, ఇదే విషయాన్ని అధికారులను వివరణ అడిగినా చెప్పలేదని మీడియాకు పైలట్ తెలిపారు. ఈడీ నుంచి ఈ నెల 15న నోటీసు అందినప్పటి నుంచి ఏ కేసుకు సంబంధించి విచారణకు రావాలని ఆదేశించిందీ తెలియదని, ఆతృతగా ఉందంటూ అధికారులకు మొరపెట్టుకున్నా సరైన జవాబు రాలేదని విచారణ తర్వాత బైటకు వచ్చిన రోహిత్ రెడ్డి మీడియాకు వివరించారు. నిర్దిష్ట ఫార్మాట్‌లో బయోడేటా తీసుకురావాల్సిందిగా తనకు ఆ నోటీసుల్లో వివరించారని, దాన్ని వెంట తీసుకెళ్ళానని, అందులోని వివరాల గురించే ఎక్కువగా ప్రశ్నించారని తెలిపారు.
ఇప్పటివరకు తనమీద ఈడీ తరఫున ఎలాంటి కేసు నమోదుకాలేదని, ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు సంబంధించి కూడా ఆరోపణలు రాలేదని, ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని, అయినా ఈడీ ఎందుకు పిలిచిందో ఆరు గంటల విచారణ తర్వాత కూడా తనకు బోధపడలేదని అన్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలు అంటూ నోటీసులో పేర్కొన్నా దానికి సంబంధించి ఆరు గంటల విచారణలో ఒక్క ప్రశ్న కూడా అడలేదన్నారు. వ్యాపారాలు, అందులోని పెట్టుబడులు, ఆర్థిక అంశాల గురించి మాత్రం లోతుగా ప్రశ్నించారని, తన దగ్గర ఉన్న సమాధానాలను చెప్పానని తెలిపారు. న్యాయ వ్యవస్థపైన తనకు నమ్మకం ఉన్నదని వ్యాఖ్యానించిన రోహిత్‌రెడ్డి లీగల్ ఒపీనియన్‌ను తీసుకుంటానని తెలిపారు. మంగళవారం విచారణకు హాజరవుతారా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బదులిచ్చారు.
దీంతో మంగళవారం విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ నోటీసుల ప్రకారం సోమవారం ఉదయం పదిన్నరకే జోనల్ ఆఫీసులో జరిగే విచారణకు హాజరుకావడానికి మణికొండలోని నివాసం నుంచి బయలుదేరినా మధ్యలో ముఖ్యమంత్రి నుంచి ఫోన్ రావడంతో ప్రగతి భవన్‌కు వెళ్ళారు. ఆ తర్వాత న్యాయవాది సూచనల మేరకు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శ్రావణ్ ద్వారా గడువు కోరుతూ ఈడీకి పర్మిషన్ లెటర్ పంపారు. కానీ దాన్ని ఈడీ ఆఫీసర్లు నిరాకరించడంతో మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 31 వరకూ గడువు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి చుక్కెదురైంది. అనివార్య పరిస్థితుల్లో విచారణకు హాజరుకావడంతో మంగళవారం ఉదయం పదిన్నర గంటల విచారణ సమయానికి ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొన్నది.






