తెలంగాణలో ప్రతి ప్రభుత్వ స్కీమ్‌లో స్కామే: MLA రఘునందన్ రావు ఫైర్

by Disha Web Desk 19 |
తెలంగాణలో ప్రతి ప్రభుత్వ స్కీమ్‌లో స్కామే: MLA రఘునందన్ రావు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పలువురు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినట్లు బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగులో ఆ పార్టీ అధినేత కామెంట్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తప్పు చేసిన మంత్రుల్ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడినట్లు చెప్తూ వారిని ఇకపైన బుద్ధిగా ఉండాలంటూ శుద్దులు చెప్పిన కేసీఆర్ వారి దగ్గరి నుంచి సంజాయిషీ కోరడమేంటని ప్రశ్నించారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ మంత్రి మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. పొగ లేనిదే నిప్పు రాదని, దారినపోయే దానయ్యల కామెంట్ల గురించి పట్టించుకోవద్దని చెప్పే కేసీఆర్ ఒక బీసీ బిడ్డను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక అవినీతి పాలనను దేశం మొత్తానికి తీసుకెళ్ళేందుకే బీఆర్ఎస్ పేరుతో పార్టీని విస్తరింపజేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో కేసీఆర్ కూడా ఒకరు అని, అదృష్టం బాగుండి సంఖ్యా బలంతో సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్ (పరోక్షంగా ప్రస్తావిస్తూ)ను క్యాబినెట్ నుంచి తొలగించిన కేసీఆర్ అగ్రవర్ణానికి చెందిన నిరంజన్ రెడ్డిని మాత్రం ఎందుకు సేవ్ చేస్తున్నారని ప్రశ్నించారు.

అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేల మీద కేసీఆర్ చర్యలేవని ప్రశ్నించారు. ధరణి విధానంలోలో పాలున్నాయంటూ స్వయంగా హైకోర్టే చెప్పిందని, ఈ విధానం ద్వారా పేదల భూములను ప్రభుత్వం అప్పనంగా అమ్ముకుంటున్నదని ఆరోపించారు. బడుగు బలహీనర్గాలకు అసైన్ చేసిన భూములను ధరణి పేరు మీద అమ్ముకుంటున్నదని ఆరోపించారు.

ఎమ్మెల్యేలు అవకతవకలకు పాల్పడుతున్నట్లు వ్యాఖ్యానించిన సీఎం, జాబితా కూడా ఉన్నదంటూ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆ లిస్టును అవినీతి నిరోధక శాఖకు పంపాలని డిమాండ్ చేశారు. దళితబంధు స్కీమ్‌లో అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేల లిస్టును సీఎం దగ్గరి నుంచి తీసుకుని ఏసీబీ డైరెక్టర్ జనరల్ కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు.

ఆ జాబితాను వెంటనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే గజ్వేల్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ళకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, సిద్దిపేటలో కొద్దిమంది రెండు లక్షల రూపాయల లంచం కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇటీవల చనిపోయిన ఆటో డ్రైవర్ ఉదంతం ఇందులో భాగమేనని రఘునందన్ రావు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటిలో స్కాం జరుగుతున్నదని ఆరోపించారు. ఆ డబ్బుతోనే ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు.

దళితబంధు స్కీమ్‌లో లబ్ధిదారుల నుంచి ఒక్కో ఎమ్మెల్యే 3-5 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీనిని న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించాలన్నారు. నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో అసెంబ్లీ ఎన్నికలుంటాయని, కానీ అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికే అక్టోబరులోనే ఎన్నికలంటూ సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం రూ. 1500 కోట్లతో కట్టిన సచివాలయం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తనకు ఆహ్వానం వచ్చిందని, కానీ ఆ రోజున నియోజకవర్గంలో పనులు ఉన్నందున వెళ్ళడం లేదన్నారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి వస్తే మే 1న ఫస్ట్ దరఖాస్తును తానే తీసుకొని వెళ్తానన్నారు. ఎవరు వచ్చినా దరఖాస్తు తీసుకునే సమయాన్ని సీఎం కేటాయించాలని డిమాండ్ చేశారు.

Also Read..

తెలంగాణలో నేనే నంబర్ వన్



Next Story

Most Viewed