రూ.1300 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలి.. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ డిమాండ్

by Ramesh Naini |

రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు.

రూ.1300 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలి.. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో (Aarogyasri) ఆరోగ్య శ్రీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు (Palvai Harish) ఆరోపించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ప్రైవేటు ఆసుపత్రులు వరుసగా అల్టిమేటం జారీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 80 శాతం మంది రోగులు ప్రైవేటు​ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా, కేవలం 20 శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షల వరకు పెంచి పేద ప్రజలు ఉచిత వైద్యాన్ని పొందవచ్చని చెబుతున్న ప్రభుత్వం, ఇప్పటివరకు ఎంతమంది పేద ప్రజలు రూ.10 లక్షల వైద్యాన్ని పొందారో చెప్పాలని నిలదీశారు. అధికారంలోకి వస్తే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు 100 పడకల ఆసుపత్రులను నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో ఆసుపత్రులను నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.1300 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story