- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులను గాలికి వదిలి.. జన్మదిన వేడుకలు చేసుకోవడమేంటి?: ఎమ్మెల్యే పల్లా
రాష్ట్రంలో తుపాన్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తుపాన్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రెండురోజులుగా మొంథా తుపాన్ వల్ల అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, పశువులు, గొర్రెలు, మేకలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయని, రోడ్లు అనేక చోట్ల తెగిపోయాయని తెలిపారు. ఈ నష్టం గురించి సీఎం, మంత్రులకు తెలుసా తెలియదా? అని ప్రశ్నించారు. నాలుగు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నదని తెలిపారు. కౌలు రైతుల నుంచి పంట కొనుగోలు చేసేది లేదంటున్నారని.. మక్కలపై ఇదేమి పాలసీ అనేది అర్థం కావడం లేదన్నారు. క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా రూ.1,800 కూడా రావడం లేదని ఆరోపించారు. సోయాబీన్ క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు. పత్తి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. తేమ శాతం 17 ఉన్నా కొనుగోలు చేసేలా సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక ధాన్యం తడిసి పోయిందని.. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. హన్మకొండలో 125 కాలనీలు నీట మునిగాయని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించకుండా జూబ్లీహిల్స్‌లో రౌడీలతో కలిసి ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓ మంత్రి తన జన్మదిన వేడుకల్లో బిజీగా ఉన్నారని.. చివరకు ఆ మంత్రి సమ్మక్క సారక్క దేవాలయ అభివృద్ధి పనుల టెండర్లను సైతం వదలలేదని అన్నారు. బందిపోట్లలా సీఎం, మంత్రులు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. జనగామలో రూ.95 లక్షలతో పూర్తయ్యే గానుగ పాడు బ్రిడ్జిని రిపేర్ చేయని అసమర్థుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాత మధు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రునాయక్, పల్లె రవికుమార్, బీఆర్ఎస్‌వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు పాల్గొన్నారు.






