దుర్గం చెరువు కబ్జా.. నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. ఆరోపణలపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సవాల్

by Ramesh Naini |

దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తనపై కక్షతోనే కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు.

దుర్గం చెరువు కబ్జా.. నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. ఆరోపణలపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తనపై వచ్చిన దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తనపై కక్షతోనే కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. దుర్గం చెరువు ప్రాంతంలో తనకు ఎలాంటి భూమి లేదని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. హైకోర్టులో చర్యలు చేపట్టిన సమయంలో తాము రెండెకరాల భూమిని కొనుగోలు చేశామని, ఆ తర్వాత అది చెల్లదని చెప్పి TDR ఇచ్చారని తెలిపారు. అనంతరం అక్కడ దుర్గం చెరువు నిర్మాణం జరిగిందని వివరించారు.

తన భూములకు సమీపంలో నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ పార్కింగ్ ఏర్పాటు చేశారన్న కారణంతో తనపై కేసు పెట్టారని, వాస్తవానికి అక్కడ ప్రభుత్వ భూమి గజం కూడా లేదని చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రైవేటు బస్సుల పార్కింగ్ సహజంగా జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు మీద, చెట్ల కింద వాహనాలు పార్కింగ్ చేసినందుకే కేసు పెట్టారని ఆరోపించిన ఎమ్మెల్యే, ఎవ్వరూ వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదులో ‘హైడ్రా’ పేరు మాత్రమే కనిపిస్తోందని అన్నారు. కేసు విషయాన్ని పోలీసులు తమ సిబ్బందికి మాత్రమే తెలిపారని చెప్పారు. ఈ కేసుపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అయితే బేషరతుగా కేసు విత్ డ్రా చేయకపోతే.. FTL పరిధిలో ఇండ్లు కట్టిన వారి ఇళ్ల ముందే ధర్నా చేస్తానని హెచ్చరించారు.

Next Story