తెలంగాణను చుట్టేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులు!

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) సెన్సేషన్ ఇప్పుడు తెలంగాణకు పాకింది.

తెలంగాణను చుట్టేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) సెన్సేషన్ ఇప్పుడు తెలంగాణకు పాకింది. నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా, వ్యంగ్య (Satire) ధోరణిలో అభిజీత్ దీప్కే అనే యువకుడు ప్రారంభించిన ఈ డిజిటల్ ఉద్యమం.. ఇప్పుడు పెను రాజకీయ తుఫానులా మారుతోంది. కేవలం కొన్ని రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సాధించి, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సైతం దడ పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ యువత ఈ ‘కాక్రోచ్' ట్రెండ్ ను సరికొత్త స్థాయికి తీసుకెల్తోంది.

నేనే తెలంగాణ సీఎం అభ్యర్థిని..

ఈ సోషల్ మీడియా ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు నేరుగా సచివాలయం (Secretariat) ముందే నిలబడి ఒక వీడియో విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాను 'తెలంగాణ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడినని, రాబోయే ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థినని సంచలన ప్రకటన చేశాడు. కేవలం ప్రకటనతోనే ఆగకుండా.. డిజిటల్ జనరేషను ఆకట్టుకునేలా తన మేనిఫేస్టోను కూడా విడుదల చేశాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయడం, విద్యార్థులందరికీ ఫీజు రియింబర్స్‌మెంట్‌ను పక్కాగా అమలు చేయడం, నిరుద్యోగులకు కనీస వేతనాలతో కూడిన శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, నేరాలకు పాల్పడే నిందితులకు జైళ్లలో ఇచ్చే వీఐపీ సౌకర్యాలను పూర్తిగా రద్దు చేయడం వంటి హామీలు ఇచ్చారు.

అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు..

ఈ సీఎం అభ్యర్థి వీడియో వైరల్ కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ నియోజకవర్గాల యువకులు కూడా రంగంలోకి దిగారు. ఎవరికి వారే తమ సొంత నియోజకవర్గాలకు 'కాక్రోచ్' జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి'గా ప్రకటించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలు షేర్ చేస్తున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీల తీరుపై విసిగిపోయిన యువత, ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఒక ఆయుధంగా వాడుకుంటూ పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు. మొదట ఇదొక సాధారణ మీమ్ (Meme) లేదా ఆన్లైన్ జోక్ అని భావించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో యువత దీనికి కనెక్ట్ అవుతున్న తీరు చూస్తుంటే తెలంగాణలో ఒక సరికొత్త సోషల్ మీడియా రాజకీయ ఉద్యమం మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story