ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌కు ఆర్మీ ఎక్స్‌పర్ట్స్.. భూగర్భ సవాళ్లకు చెక్

by Naga Rani Yarlagadda |

ప్రపంచంలో అత్యంత పొడవైన ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను ప్రపంచస్థాయి ప్రమాణాలతో చేపట్టేందుకు ప్రభుత్వం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను నియమించింది.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌కు ఆర్మీ ఎక్స్‌పర్ట్స్.. భూగర్భ సవాళ్లకు చెక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతో పాటు భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోనే ఇది అత్యంత పొడవైన(సుమారు 44 కి.మీ) టన్నెల్. ఇప్పటికే టన్నెల్ పనుల పర్యవేక్షణలో నిపుణుల బృందం పనిచేస్తున్నది. అంతేకాకుండా.. పనులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపట్టేందుకు ఇద్దరు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను రంగంలోకి దించింది. భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడానికి భారత ఆర్మీ ప్రత్యేక బృందం, నిపుణులు ఇప్పటికే రంగంలోకి దిగారు. మాజీ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా పర్యవేక్షణలో టన్నెల్ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఆర్మీ ఎక్స్‌పర్ట్స్‌ను వీరికి అటాచ్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్లిష్ట భూగర్భ పరిస్థితుల్లో పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇన్‌లెట్, ఔట్‌లెట్ వద్ద ప్రత్యేక పర్యవేక్షణ

కొత్తగా నియమితులైన ఆర్మీ నిపుణుల్లో ఒకరు టన్నెల్ ఇన్‌లెట్ వద్ద, మరొకరు ఔట్‌లెట్ వద్ద పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. అదనంగా మొత్తం టన్నెల్ నిర్మాణ కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలిస్తూ భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయో లేదో పరిశీలించేందుకు మరో సీనియర్ అధికారిని నియమిస్తున్నారు. ఈ ముగ్గురు అధికారులు ప్రముఖ సాంకేతిక నిపుణుడు పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో అసోసియేట్‌లుగా పనిచేస్తారు. టన్నెల్ తవ్వకాల సమయంలో ఎదురయ్యే భూగర్భ ఒత్తిళ్లు, రాళ్ల స్థితి, నీటి ఒత్తిడి, గాలి ప్రసరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలనూ అమలు చేయాలని నిర్ణయించారు.

అధునాతన వెంటిలేషన్

టన్నెల్ పనుల్లో ముఖ్యంగా వెంటిలేషన్‌ను ప్రభుత్వం కీలక అంశంగా తీసుకుంది. టన్నెల్ లోపల పనిచేసే సిబ్బందికి తగిన ఆక్సిజన్ అందేలా అధునాతన వెంటిలేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాస్ లీకేజీలు, ఆక్సిజన్ లోపం, అధిక తేమ వంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పరికరాలు అమర్చనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చేలా ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సెన్సార్ పరికరాలు అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. భూగర్భంలో పనిచేసే కార్మికుల భద్రత కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

వేగం పుంజుకున్న టన్నెల్ పనులు

కొంతకాలంగా సాంకేతిక సమస్యలు, భూగర్భ పరిస్థితుల కారణంగా ఆలస్యమైన టన్నెల్ పనులు ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఇన్‌లెట్ వైపు తవ్వకాలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రాజెక్టు పురోగతిపై అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టన్నెల్‌లో రాక్ స్ట్రెంగ్త్, వాటర్ సీపేజ్, భూగర్భ ఒత్తిళ్లను అంచనా వేస్తూ ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నారు. అవసరమైన చోట రాక్ బోల్టింగ్, షాట్‌క్రీట్, స్టీల్ రిబ్స్ వంటి సపోర్ట్ సిస్టమ్స్ అమలు చేస్తున్నారు. టన్నెల్ నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నట్లు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక టన్నెల్ బోరింగ్ టెక్నాలజీ, సేఫ్టీ మానిటరింగ్ సిస్టమ్స్, రియల్ టైమ్ డేటా అనాలిసిస్ విధానాలను అమలు చేస్తున్నారు. భూగర్భ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చోట వెంటనే మార్పులు చేసేలా ప్రత్యేక కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుంది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను డిసెంబర్ 9, 2027 నాటికి పూర్తి చేసి, రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి గడువు విధించారు. దానికి అనుగుణంగానే టన్నెల్ పనులు కొనసాగుతున్నాయని నిపుణులు, అధికారులు వెల్లడించారు.

టీబీఎం తొలగింపు..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వడానికి వినియోగిస్తున్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌(టీబీఎం)ను పూర్తిగా తొలగించారు. రాబిన్‌ కంపెనీ, జేపీ కంపెనీ అధ్వర్యంలో సుమారు 20 మంది నెల రోజులకుపైగా శ్రమించి.. దాన్ని ముక్కలుగా కత్తిరించి తీసేశారు. మిగిలిన పనులను రెండువైపులా ‘డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ మెథడ్‌ (డీబీఎం)’లో పూర్తిచేయనున్నారు. కాగా.. నాగర్‌కర్నూలు జిల్లా బ్రహ్మగిరి వద్ద ఇన్‌లెట్‌ టన్నెల్‌ వైపు 13.93 కిలోమీటర్ల వరకూ తవ్వకం జరిగాక, గతేడాది ఫిబ్రవరిలో టన్నెల్ పైకప్పు టీబీఎంపై కూలింది. ఆ టైంలో అక్కడున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం కారణంగా ఇన్‌లెట్‌ టన్నెల్‌వైపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అవుట్‌లెట్‌ టన్నెల్‌లోనూ టీబీఎం బేరింగ్‌ పాడవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టీబీఎంకు బిగించేందుకు అమెరికా నుంచి బేరింగ్‌ తెప్పించింది. కానీ, దాన్ని బిగించకుండానే పక్కనబెట్టారు. ఇన్‌లెట్‌ టన్నెల్‌ వైపు 13.950 కిలోమీటర్ల నుంచి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని నివేదిక అందడంతో ఇరువైపులా డీబీఎం పద్ధతిలో సొరంగం పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్‌లెట్‌ టన్నెల్‌ వైపు 13.93 కి.మీ వరకూ తవ్వకం జరగ్గా.. మన్యవారిపల్లి దగ్గర ఆవుట్‌లెట్‌ టన్నెల్‌ వైపు 20.43 కి.మీ మేర సొరంగం తవ్వారు. ఇంకా 9.53 కి.మీ మేర సొరంగం తవ్వాల్సి ఉంది. ఆ పనులనే డీబీఎం పద్ధతిలో చేపట్టారు.

Next Story