మిస్సింగ్.. ట్రేసింగ్! కేసుల ఛేదనలో తెలంగాణకు 94 శాతం సక్సెస్ రేట్‌

by Kema Shiva Kumar |

వివిధ సందర్భాలలో తప్పిపోయిన వ్యక్తులపై నమోదైన కేసులలో మిస్ అయిన వారిని వెంటనే కనిపెడుతుంటారు.

మిస్సింగ్.. ట్రేసింగ్!  కేసుల ఛేదనలో తెలంగాణకు 94 శాతం సక్సెస్ రేట్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ సందర్భాలలో తప్పిపోయిన వ్యక్తులపై నమోదైన కేసులలో మిస్ అయిన వారిని వెంటనే కనిపెడుతుంటారు. మరి కొన్ని సందర్భాలలో ఏండ్ల తరబడి కేసులు అలా పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా మిస్సింగ్ కేసుల సమాచారం కోరగా, డీజీపీ ఆఫీసు సమాచారం అందించింది. 2020 సంవత్సరం నుంచి 19 అక్టోబర్ 2024 వరకు నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు వెల్లడించారు. పోలీస్ శాఖ ఇచ్చిన నివేదికల ప్రకారం రాష్ర్టవ్యాప్తంగా 6,468 మంది ఇంకా మిస్సింగ్ కేసులలో ఉన్నారు. మిస్ అయిన తమ వాళ్లను త్వరగా వెతికిపెట్టాలని వారి కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు. మిస్సింగ్ కేసులలో ఉన్న వారు అసలు బతికి ఉన్నారా లేదా, ఉంటే ఎలా ఉన్నారో అని మనోవేదనతో కాలం వెల్లదీస్తున్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ పేర్కొంటున్నారు.

భూపాలపల్లిలో ఒకటే మిసింగ్ కేసు

2020 నుంచి 2024 వ‌ర‌కు తెలంగాణ‌లో 96,614 మిస్సింగ్ కేసులు న‌మోద‌య్యాయి. 1,03,496 మంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి. వారిలో 97,028 ఆచూకీ కనిపెట్టారు. సైబారాబాద్ పరిధిలో అత్యధికంగా 1,467 మంది బాలికలు మిస్సింగ్ కేసులు నమోదు కాగా, 1,372 కేసులు ట్రేసింగ్ చేశారు. భూపాలపల్లిలో జిల్లా పరిధిలో ఒక్క కేసు మాత్రమే నమోదు కాగా, ఈ కేసును ట్రేస్ చేశారు. అదిలాబాద్‌లో 60 కేసులు నమోదు కాగా, అన్ని కేసులను ట్రేసింగ్ చేశారు. సూర్యాపేట పరిధిలో 109 కేసులు నమోదు కాగా, అన్ని ట్రెసింగ్ చేశారు.

18 ఏళ్లలోపు మిస్సింగ్ అయిన అబ్బాయిలు 5,750 మంది

దొరికిన వారు - 5,455

దొర‌క‌ని వారు - 295

18 ఏళ్లలోపు మిస్సింగ్ అయిన అమ్మాయిలు 8,359 మంది

దొరికిన వారు - 7,970

దొర‌క‌ని వారు - 389

మిస్సింగ్ అయిన మ‌హిళ‌లు 54,744 మంది

దొరికిన వారు - 52,312

దొర‌క‌ని వారు - 2432

మిస్సింగ్ అయిన పురుషులు 34,643 మంది

దొరికిన వారు - 31,291

దొర‌క‌ని వారు - 3,352

2020 నుండి 2024 అక్టోబర్ 19 వరకు నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు

సం. కేసులు తప్పిపోయిన వారు ఆచూకీ లభించిన వారు ఆచూకీ లభించని వారు శాతం

2020 16,098 17,168 16,629 539 97%

2021 19,611 21,341 20,428 637 96%

2022 19,801 21,075 20,623 718 96.6%

2023 21,899 23,509 22,294 1215 96.6%

2024 19,205 20,403 17,054 3349 83.5%

ఏండ్ల తరబడి ఉన్న కేసులను ‘ఉమెన్ సెఫ్టీ వింగ్’ ట్రేస్

మిస్సింగ్ కేసులను ఛేదించడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ సాంకేతికతను వినియోగించుకుంటోంది. హైదారాబాద్ కమిషనరెట్ పరిధిలోని కంచన్‌బాగ్ పీఎస్‌లో 2014లో 12 ఏండ్ల బాలుడు తప్పిపోయిన కేసు నమోదు కాగా, పదేండ్ల తర్వాత కనిపెట్టి యువకుడిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఆధార్ కార్డుకు లింకై ఉన్న ఫోన్ నంబర్ సహయంతో విచారణ చేసి మిస్సింగ్ కేసు కథ సుఖాంతం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ మిస్సింగ్ కేసులో బెలూన్లు విక్రయించే 11 ఏండ్ల బాలిక తప్పిపోయినట్టు 2015లో ఫిర్యాదు నమోదైంది. 9 ఏండ్ల తర్వాత ఆ బాలికను ఉమెన్ సెఫ్టీ విభాగం కనిపెట్టింది. బాలిక మిస్ అయి ఇద్దరు పిల్లలు, భర్తతో నిజామాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. హైదారాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాంద్రాయణ‌గుట్ట పీఎస్ పరిధలో 2017 ఇద్దరు పిల్లలు తప్పిపోయిన కేసు నమోదైంది. పదేండ్ల వయస్సు గల బాలిక, సుమారు 8 ఏండ్ల వయస్సు గల బాలుడు ఉన్నారు. 7 ఏండ్ల తర్వాత కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఎహెచ్ఈ సైబర్ బృందం ద్వారా ఉమెన్ సెఫ్టీ వింగ్ బృందం ఇద్దరు పిల్లలను కనిపెట్టింది.

అదృశ్యమైన వారి ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా..

రాష్ర్టవ్యాప్తంగా మిస్సింగ్ అయిన వారి ఆచూకీ కనిపెట్టాడానికి ఉమెన్ సెఫ్టీ వింగ్ నూతన ఆవిష్కరణలు చేపట్టింది. మహిళలు, పిల్లల భద్రత కోసం లెర్నింగ్ కమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు సీఐడీ, ఉమెన్ సెఫ్టీ డీజీ శిఖా గోయల్ శంకుస్థాపన చేశారు. ఫ్యామీలి కౌన్సెలింగ్ సెంటర్స్, డిజిటల్ అడ్వకేసి అవేర్‌నెస్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ అందిస్తున్నారు. నవంబర్ 2024 వరకు తెలంగాణలో 22,780 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 19,191 కేసులు ఇప్పటికే ఛేదించామని ఉమెన్ సెఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ పేర్కొన్నారు. మిస్సింగ్ కేసులలో తెలంగాణ ట్రేసింగ్ శాతం 84.25 %, జాతీయ సగటు 51.1% అని తెలిపారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 27 కేసులను గుర్తించిందన్నారు.

ఎదురుచూపులకు పరిష్కారం చూపాలి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ ఎంతో మంది తప్పిపోతున్నారు. కొంతమంది ఆచూకీని పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మాత్రం దొరకడం లేదు. బాలికలు, బాలురు, మహిళలు, పురుషులు ఆచూకీ దొరకక వారి కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. రాష్ట్రంలో 2020 నుంచి 2024 అక్టోబర్ వరకు ఎంతోమంది తప్పిపోయారు, ఎంతమంది ఆచూకీ తెలియలేదు అని సమాచారం అడగగా, తెలంగాణ డీజీపీ ఆఫీసు జిల్లాల వారీగా సమాచారం ఇచ్చింది. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారు చాలా మంది ఉన్నారు. వారి కుటుంబాలు ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటాయి. వారు బతికి ఉన్నారో, లేదో తెలియకుండా క్షణక్షణం బాధ అనుభవిస్తూ ఉంటారు. వారి బాధకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉంది. ఇప్పటికైనా వారి ఎదురుచూపులకు పరిష్కారం చూపాలి.

- రాజేంద్ర పల్నాటి, ఫౌండర్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్

Next Story