శిల్పారామం, విక్టోరియా హెమ్ లో సందడి చేసిన మిస్ వరల్డ్ బ్యూటీస్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-22 15:27:31  IST  )

ప్రపంచ అందాల పోటీలకు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ మహానగరంలో సందడి వాతావరణం నెలకొంది.

శిల్పారామం, విక్టోరియా హెమ్ లో సందడి చేసిన మిస్ వరల్డ్ బ్యూటీస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ అందాల పోటీలకు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ మహానగరంలో సందడి వాతావరణం నెలకొంది. 72వ మిస్ వరల్డ్ పోటీల భాగంగా శిల్పారామంలో అందాల భామలు సందడి చేశారు. శిల్పారామంలో నిర్వహించిన పలు కార్యక్రమాలు కన్నుల పండువగా ముగిశాయి. ఈ కార్యక్రమాలకు మహిళాభివ్రుద్ది శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇందిరా మహిళా శక్తి బజార్ ను సందర్శించిన అందగత్తెలను ఉద్దేశించి సీతక్క మాట్లాడారు. అనంతరం మహిళా శక్తి సంఘాల ఉత్పత్తులను పరిచయం చేశారు. స్టాళ్లలో పెట్టిన మహిళా సంఘాల ఉత్పత్తులు బాగున్నాయంటూ సుందరీ మణులు కొనియాడారు.

సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన అందాల భామలు:

శిల్పారామం పర్యటనలో భాగంగా, ఈ అందాల భామలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. చందమామా, ఒక్కేసి పువ్వేసి.. అంటూ సంప్రదాయ గీతాల నడుమ పువ్వులతో ముస్తాబైన బతుకమ్మ చుట్టూ పాడుతూ, నాట్యమాడుతూ అలరించారు. విదేశీ అందాల భామలు సైతం చేతిలో పువ్వులు పట్టుకుని, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ నృత్యానికి ఉత్సాహంగా కాలు కదపడం విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా మట్టితో కుండలు చేస్తూ ఎంజాయ్ చేశారు. వారి ఉత్సాహం, ఆసక్తి స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొందరు పోటీదారులు బతుకమ్మ నృత్యంలో ప్రత్యేక శైలిని ప్రదర్శించి, తెలంగాణ మహిళలతో కలిసి పాడిన పాటలు వారి సంస్కృతి పట్ల అభిమానాన్ని చూపించాయి.

విక్టోరియా మెమోరియల్ హోమ్ సందర్శనలో సేవాభావం:

శిల్పారామం పర్యటన అనంతరం, 107 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా షిజ్కోవా హైదరాబాద్ లో మరో చారిత్రక స్థలం అయిన సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్‌ను సందర్శించారు. 122 సంవత్సరాల పురాతన విక్టోరియా హోమ్ భవన నిర్మానాన్ని చూసి అబ్బుర పడ్డారు.

హోమ్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులలో అందాల భామలు సరదాగా ముచ్చటించి, సరదాగా గడిపారు. వారికి పుస్తకాలు, ఆట వస్తువులను బహుకరించారు తమ లక్ష్యాలు సాధించే దిశగా ఆత్మవిశ్వాసాన్ని వసతి గృహం విద్యార్థులలో కలిగించారు. కష్టపడే తత్వం విజ్ఞాన సముపార్జనతోపాటు విద్యలో రాణిస్తేనే శక్తివంతంగా మారతారని పేర్కొన్నారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న పటిష్టమైన కలలు ఉంటేనే తమ లక్ష్యాలను చేరుకుంటారని ముద్దుగుమ్మలు విద్యార్థులతో అన్నారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినిలకు పలు బహుమతులను, వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను మిస్ వరల్డ్ ప్రతినిధులు బహుకరించారు. హోమ్ నిర్వాహకులు యువతులు సామాజిక సేవ పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమని పేర్కొన్నారు

ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలతో మిస్ వరల్డ్ కాంటేస్టర్లు కలిసి ఆడారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ లాబ్ ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ చైర్మన్ మోర్లే పర్యాటకశాఖ డైరెక్టర్ హనుమంతు, రాచకొండ సిపి, ఎస్సీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు .

హైదరాబాద్ ఆతిథ్యం, ఇతర పర్యటనలు:

ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరానికి చేరుకున్న దాదాపు 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంతకుముందు, ఈ అందాల భామలు హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్ బజార్‌లను కూడా సందర్శించి, నగరం యొక్క వారసత్వ వైభవానికి ఫిదా అయ్యారు. లాడ్ బజార్‌లో గాజులు, ముత్యాల హారాలు షాపింగ్ చేశారు. కొందరు వ్యాపారులు సుందరీమణుల వద్ద డబ్బులు తీసుకోకుండా, హైదరాబాద్ ప్రత్యేకతను తమ దేశాల్లో చాటాలని కోరారు.

గ్రాండ్ ఫినాలే మరియు ముగింపు:

మే 10న ప్రారంభమైన ఈ మిస్ వరల్డ్ పోటీలు మే 31వ తేదీన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగియనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీలను తెలంగాణ ప్రభుత్వం, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఈ పోటీలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో మిస్ వరల్డ్ విజేత పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. భారత్ తరపున రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా ఈ పోటీలో ఉన్నారు.

Next Story