- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామప్ప ఆలయంలో మిస్ ఇండియా! రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు.. దేవాలయ విశేషాలకు ఫిదా
72వ మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఫెమినా మిస్ ఇండియా - 2023 విజేత రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: 72వ మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో (Miss India - 2023) ఫెమినా మిస్ ఇండియా - 2023 విజేత రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా మిస్ ఇండియా నందిని గుప్తా (Nandini Gupta) యునెస్కో (UNESCO) గుర్తింపు పొందిన (Ramappa Temple) రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరుడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆమె దేవాలయం ప్రత్యేకత, విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు గుడి ప్రాంగణంలో ఆమె ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ, మిస్ ఇండియా ఖాతాల ద్వారా పంచుకున్నారు.
‘హైదరాబాద్‌కి నా ఒక్క రోజు ప్రయాణం కేవలం యాదృచ్ఛికంగా జరగలేదు. ధన్యవాదాలు పరమేశ్వరుడా, నన్ను మార్గనిర్దేశం చేసినందుకు. ఇది నిజంగా ఓ పిలుపు! అద్భుతమైన స్థలాన్ని సందర్శించినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతతో ఉన్నాను. రామప్ప ఆలయంలో భారతీయ శిల్పకళ, శతాబ్దాల క్రితం చేసిన అద్భుతమైన సాంకేతికత చూసి ఆశ్చర్యపోవాల్సిందే. హై హీల్స్ వేసుకున్న లేడీ శిల్పం, సంగీతం వినిపించే స్తంభాలు, తేలియాడుతున్న రాళ్లు, ఈ సృష్టి కీర్తిని ఊహించడం కష్టమే. తెలంగాణ అందించిన సుందర ప్రయాణం ప్రతి క్షణం అమూల్యంగా అనిపించింది. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం శాఖ ఆతిథ్యానికి, అందించిన సౌకర్యానికి టీమ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను, పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్-2025 పోటీలు మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 140 దేశాలకు చెందిన వారు పాల్గొననున్నారు. తెలంగాణలోని 10 ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతాయి.






