- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ తల్లి విగ్రహాలపై తప్పుదారి పట్టించే ప్రచారం.. తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వివరణ
తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా @FactCheck_TG తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం అని, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉందని తెలిపింది. వాస్తవానికి వీటి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కేవలం రూ.5.8 కోట్లు మాత్రమేనని స్పష్టం చేసింది.
దీనిలోని వాస్తవాలు..
తెలంగాణ తల్లి విగ్రహాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తోందన్న వార్తల్లో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. వీటి కోసం తెలంగాణ ప్రభుత్వ రోడ్లు మరియు భవనాల (R&B) శాఖ మొత్తం రూ.5.8 కోట్ల బడ్జెట్‌ను మాత్రమే మంజూరు చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల 'సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల' (IDOC) ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించడానికి ఈ నిధులు కేటాయించారు. ఒక్కో విగ్రహం ఏర్పాటుకు సుమారు రూ.17 లక్షల వరకు వ్యయం అవుతుంది. మొత్తం వ్యయం రూ.5.8 కోట్లు మాత్రమే, ప్రచారంలో ఉన్నట్టుగా రూ.200 కోట్లు కాదు. ఈ విగ్రహాల తయారీ, ప్రతిష్టాపన పనులను R&B శాఖ స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఈ పనులన్నింటినీ ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.200 కోట్ల ఖర్చు గురించి అతిశయోక్తితో కూడిన ఆర్థిక గణాంకాలతో వస్తున్న పోస్టులు పూర్తిగా నిరాధారమైనవి. పౌరులు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.






