- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులపై మంత్రుల సమీక్ష.. ఉగాదిలోగా పెద్దారెడ్డి లిఫ్ట్ స్కీమ్‌కు శంకుస్థాపన
సింగూరు డ్యామ్ సేఫ్టీ, పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక సింగూరు ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలోని కీలక నిర్ణయాలు ఇవే..
నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు సింగూరు డ్యామ్ పరిరక్షణ పనులను వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టెక్నికల్ కమిటీని నియమించాలని మంత్రులు సూచించారు. అదేవిధంగా జూలై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు సాగాలన్నారు. సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26లోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు.
ఇక ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం డీపీఆర్ (DPR)లను శరవేగంగా సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. ఉగాది పండుగ లోపు ఈ పనులకు శంకుస్థాపన చేయాలని అధికారులను ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టు పరిరక్షణతో పాటు, పర్యాటక పరంగా ప్రాజెక్టు సుందరీకరణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. ఆందోల్ నియోజకవర్గంలోని చిన్న నీటి ప్రాజెక్టులైన చెరువుల పునరుద్ధరణకు టెండర్లు పూర్తి చేసి, ఈ సీజన్‌లోనే రైతులకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, ఈఎన్సీలు రమేష్ బాబు, శ్రీనివాస్, టి.శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్ఈబీ. రాజమ్మ, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.






