- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు..మేడారం పనులపై మంత్రి పొంగులేటి
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. గురువారం మేడారంలో (Medaram Jatara) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. మేడారం మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జాతర పనుల పురోగతిపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందు మంత్రులు ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, స్తూపం రోడ్లను వాహనంలో పరిశీలించి, శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలు పునరుద్ధరణ పనులను పరిశీలించి, వన దేవతలను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ల్యాండ్ స్కేపింగ్ పనులను, ప్రధాన ద్వారం ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు.
ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు:
సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, రహదారులపై ఉన్న మట్టి, ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లను నాటాలని, అవసరం ఉన్న చోట కూలీల సంఖ్య పెంచుకొని పనులు జరిగేలా చూడాలని అన్నారు. పనుల విషయంలో అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర పరిసరాలను జోనల్, యూనిట్ విధంగా విభజించి జోనల్‍కు ఒక ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలను అప్పజెప్పాలని ఆలయ ప్రాంగణ పరిసరాలలో మిగిలిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. డివైడర్ పనులు పూర్తయ్యాక వెంటనే ఫైర్ ఇంజిన్లతో అన్ని రహదారులపై క్లీనింగ్ నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
అన్ని శాఖలతో సమన్వయం చేసుకోండి:
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణ రాతి స్తంభాలకు పచ్చదనంగా వివిధ రకాల పూలతో సుందరీకరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. మేడారం జాతర రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






