సచివాలయంలో కొనసాగుతున్న RTC పంచాయతీ.. గడువు కోరుతున్న మంత్రులు!

by Gantepaka Srikanth |

లంగాణ సచివాలయంలో ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ (JAC) నేతల మధ్య జరుగుతున్న చర్చలు పీఆర్సీ బకాయిల వద్ద ఆగిపోయాయి. మెజారిటీ డిమాండ్లపై సానుకూలత వ్యక్తమైనప్పటికీ, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిల చెల్లింపు అంశం ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది.

సచివాలయంలో కొనసాగుతున్న RTC పంచాయతీ.. గడువు కోరుతున్న మంత్రులు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ (JAC) నేతల మధ్య జరుగుతున్న చర్చలు పీఆర్సీ బకాయిల వద్ద ఆగిపోయాయి. మెజారిటీ డిమాండ్లపై సానుకూలత వ్యక్తమైనప్పటికీ, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిల చెల్లింపు అంశం ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. తమకు రావాల్సిన పీఆర్సీ బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని జేఏసీ నేతలు మంత్రుల బృందానికి స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక సమస్యలతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ఆర్థికపరమైన ఈ కీలక డిమాండ్‌పై స్పష్టమైన హామీ లభిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని వారు భీష్మించుక కూర్చున్నారు. మరోవైపు, ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని బకాయిల చెల్లింపునకు కొంత సమయం (వ్యవధి) కావాలని మంత్రులు కోరుతున్నారు. బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, ఏకమొత్తంలో చెల్లించడం ప్రస్తుత పరిస్థితుల్లో భారమవుతుందని, దశలవారీగా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రులు సూచించినట్లు సమాచారం.

కొనసాగుతున్న ఉత్కంఠ..

ఆర్టీసీ బలోపేతానికి తాము కట్టుబడి ఉన్నామని, కాబట్టి కార్మికులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొంతకాలంగా వేచి చూస్తున్నామని, ఇకపై జాప్యాన్ని భరించలేమని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. పీఆర్సీ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖితపూర్వక స్పష్టత వస్తుందనే దానిపైనే ఇప్పుడు సమ్మె భవిష్యత్తు ఆధారపడి ఉంది. మంత్రుల బృందం మరోసారి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

Next Story