- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రులు సైలెంట్.. విప్‌లు వైలెంట్! ప్రతిపక్షాలపై ఎదురుదాడికి సీఎం వ్యూహం
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ విప్‌లను క్రియాశీలం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం శాసనసభ, శాసనమండలిలో మొత్తం 9 మంది ప్రభుత్వ విప్‌లు ఉన్నారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారితో సమావేశమై ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, వారంలో ఒక రోజు విప్‌లకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇటీవల కొంతకాలంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై మంత్రులు అంత సీరియస్‌గా స్పందించడంలేదని విమర్శ ఉంది. ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే వాటిల్లో మాట్లాడున్నారు తప్ప ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం ఇవ్వడంలేదని, ఎదురుదాడి చేయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు ఎందుకులే అనే రీతిలో వారి వ్యవహారశైలి ఉందని, తమ శాఖకు సంబంధించి అయితే ప్రకటనలు ఇవ్వడం మినహా అగ్రెసివ్‌గా లేరని గుర్తించారు. ఆరోపణలు, విమర్శలు తమ మీద కాదు కదా, ప్రభుత్వాన్ని విమర్శించారు కదా, ముఖ్యమంత్రి చూసుకుంటారులే అనుకుంటూ.. ముఖ్యమంత్రిని విమర్శించినా కూడా ఇదే రీతిలో మనకేందుకులే అనే రీతిలో అనే భావనలో ఉన్నట్టు తేల్చారు. మరికొందరు మంత్రులు తమకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని, మనమెందుకు స్పందించాలనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇలా అనేక రకాల కారణాలతో మంత్రులు అనుకున్నంత స్థాయిలో స్పందించడంలేదని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. పార్టీ కీలక నాయకులు కూడా ఈ విషయాలను చేరవేసినట్లుగా తెలిసింది.
ప్రతి వారం సీఎంతో సమావేశం...
సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తే తప్ప ప్రజల నుంచి కాంగ్రెస్‌పార్టీ, ప్రభుత్వం పట్ల సానుకూలత రావడంలేదని గుర్తించారు. సీఎం మాట్లాడితేనే ప్రజలు ఆ అంశాన్ని పాజిటివ్కోణంలో చూస్తున్నారని, లేదంటే వారి వరకు వెళ్లడంలేదని విశ్లేషించారు. ఈ నేపథ్యంలో విప్‌ల ద్వారా ప్రతిపక్షాలపై ఎదురుదాడి, విమర్శలు, పథకాలపై సమాచారాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి విప్‌లతో సమావేశమైనట్లుగా సమాచారం. ఇకపై వారం, పది రోజులకు ఒకసారి వారితో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో విప్‌లు మీడియాలో ప్రభుత్వ వాదన, కాంగ్రెస్‌పార్టీ వాదనను బలంగా వినిపించడానికి అవసరమైన డేటాను అందించడానికి సీఎంవో సమాచారం డేటా అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా రాజకీయంగా మాట్లాడటమే కాకుండా ఆధారాలు, లెక్కలు ఇస్తే ప్రభుత్వ వాదన బలంగా ప్రజల్లోకి వెళ్తుందని, ఈ వాదనలను ప్రజలు విశ్వసించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విప్‌లకు ప్రాధాన్యం పెంచుతామని, అదే సమయంలో ప్రభుత్వ వాదనను బలంగా పోయే విధంగా చర్చల సందర్భంలో మాట్లాడటం, ప్రెస్‌మీట్‌లు పెట్టి చెప్పడం చేయాలని సూచించినట్లుగా తెలిసింది.






