- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి 20ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, రాజకీయ ప్రముఖులు
జడ్పీటీసీ నుండి ప్రారంభమై సీఎం దాకా ప్రజా జీవితంలో 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రముఖులు, పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జడ్పీటీసీ నుండి ప్రారంభమై సీఎం దాకా ప్రజా జీవితంలో 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రముఖులు, పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కలు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మొక్కవోని ధైర్యంతో అనేక రాజకీయ వత్తిళ్ళను తట్టుకొని ధీరోదత్త రాజకీయాలతో లక్ష్యాన్ని సాధించారు : టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ప్రజా నేత రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మిడ్జిల్ మండల జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి మొక్కవోని ధైర్యంతో అనేక రాజకీయ వత్తిళ్ళను తట్టుకొని ధీరోదత్త రాజకీయాలు చేశారని, తన లక్ష్యాన్ని సాధించారని ఆయన ప్రశంసించారు. రేవంత్ రెడ్డి మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక సంస్థలు ప్రతినిధిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, టీపీసీసీ అధ్యక్షులుగా రాజకీయాల్లో అన్ని వ్యవస్థలలో పని చేసిన గొప్ప అనుభవం ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ప్రజా జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు : మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
జడ్పీటీసీగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నేడు రాష్ట్ర సీఎం స్థాయికి చేరుకోవడం ఆయన పట్టుదల, ప్రజల పట్ల నిబద్ధత, నిరంతర కృషికి నిదర్శనమని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లు పేర్కొన్నారు. ప్రతి పదవిని ప్రజా సేవకు వేదికగా మలుచుకుంటూ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న నాయకుడిగా ఆయన ఎదిగారని కొనియాడారు. ప్రజా జీవితంలో మరెన్నో విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని సీతక్క, పొన్నం ప్రభాకర్ లు ఆకాంక్షించారు.
గాంధీభవన్ లో స్వీట్లు పంపిణీ చేసి కార్యకర్తలు, నేతలతో కలసి సంబరాలు చేసుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్..
సీఎం రేవంత్ రెడ్డి రెండు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సంధర్భంగా గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర ఫిషరీష్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వరంయలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ళ రాజకీయ జీవితం లొ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, తన లాంటి నేటి యువ నేతలకు రేవంత్ రెడ్డి లైఫ్ జర్నీ ఎంతగానో ఉపయోగపడుతుందని మెట్టు సాయికుమార్ అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నట్లుగా ఆయన చెప్పారు. సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మహమ్మద్ అలీ షబ్బీర్, పలువురు నేతలున్నారు.






